నలుగురిని కాపాడి.. కొట్టుకుపోయాడు!!
ఒకవైపు బియాస్ నదీ జలాలు ఉధృతంగా తరుముకొస్తున్నాయి.. మరోవైపు స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా ముందు తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ నలుగురు స్నేహితుల ప్రాణాలు కాపాడాడు. అతడిపేరు ముప్పిడి కిరణ్ కుమార్. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముప్పిడి వెంకటరమణ కుమారుడైన కిరణ్ తన స్నేహితులను కాపాడి, తాను మాత్రం గల్లంతైపోయాడు. ప్రమాదస్థలంలో కిరణ్కు సమీపంలో ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వాళ్లిద్దరినీ కాపాడేందుకు కిరణ్ నదీ ప్రవాహంలోనే ఉండిపోయాడు. వారితో పాటు మరో ఇద్దరిని అత్యంత కష్టమ్మీద ఒడ్డుకు చేర్చాడు. తమ బృందానికి నాయకుడిగా ఉన్న అతడు.. తనను తాను మాత్రం కాపాడుకోలేకపోయాడు.
''నీటిమట్టం పెరుగుతున్నట్లు గుర్తించగానే కిరణ్ ప్రమాదాన్ని ఊహించి మమ్మల్ని ఒడ్డువైపు నెట్టేశాడు. మేమంతా ఒడ్డుకు చేరుకుని, కిరణ్ ఎక్కడున్నాడా అని చూశాం. అతడు నీళ్లలోంచి బయటకు రావడానికి కష్టపడుతున్నట్లు మాకు అర్థమైంది. కానీ అతడు ఎలాగైనా వస్తాడన్న ఆశతోనే మేం చాలాసేపు చూశాం. కానీ, కింద ఉన్న రాయి కొట్టుకుపోవడంతో కిరణ్ కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు'' అని ప్రత్యూష తెలిపింది. తన కుమారుడికి ఈత బాగా వచ్చని, అతడు ఎలాగోలా ఎక్కడో ఒక చోట సురక్షిత ప్రాంతానికి చేరుకునే ఉంటాడని కిరణ్ తండ్రి వెంకటరమణ అన్నారు. ఆయనతో పాటు అతడి స్నేహితులు చాలామంది చేస్తున్న ప్రార్థనలు ఫలించి, కిరణ్ బయటపడే అవకాశాలు కూడా లేకపోలేవు!!