సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. రాష్ట్రమంతటా 144 సెక్షన్ కొనసాగుతోంది. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు. పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్రం సైన్యానికి పూరి స్వేచ్ఛనిచ్చింది. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు.
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సజ్జాద్‌లోన్‌తో సహా వేర్పాటువాదులంతా ఇంకా గృహనిర్భంధంలోనే కొనసాగుతున్నారు. ఇంటర్‌నెట్, కమ్యూనికేషన్ సర్వీసులు రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. జమ్మూకశ్మీర్ వ్యవస్థీకరణ బిల్లు పూర్తిగా చట్టంగా మారేవరకు ఎవరు సంబరాలు నిర్వహించరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించింది.
కాగా నేడు లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్ధు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జమ్మూకశ్మీర్ వ్యవస్థీకరణ బిల్లు, రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలో స్పష్టమైన మెజార్టీతో ఉండడంతో ఈ బిల్లులను బీజేపీ సునాయసంగా నెగ్గనుంది. రేపు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment