‘ర్యాన్’ అధిపతుల ముందస్తు బెయిల్ నిరాకరణ
సాక్షి,ముంబయిః గుర్‌గావ్‌లో స్కూల్ విద్యార్థి హత్య కేసుకు సంబంధించి ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓనర్లు గ్రేస్ పింటో, అగస్టీన్ పింటో, ర్యాన్ పింటోల ముందస్తు బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ వారిని అరెస్ట్ చేయరాదని కోర్టు పేర్కొంది. నిందితులు పారిపోతారనే సందేహంతో వారి పాస్‌పోర్ట్‌లను సమర్పించాల్సిందిగా కోరింది.
స్కూలు ట్రస్టీలు కోరిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నట్టు గత వారం స్కూల్ వాష్‌రూమ్‌లో దారుణ హత్యకు గురైన బాలుడి తండ్రి వరుణ్ ఠాకూర్ పేర్కొన్న క్రమంలో బాంబే హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. జరిగిన దారుణ ఘటనకు స్కూల్ యాజమాన్యం, ట్రస్టీలు పూర్తి బాధ్యత వహించాలని, వారే అన్ని విధాలా జవాబుదారీ అని, వారి బెయిల్ దరఖాస్తును తిరస్కరించాలని బాధిత బాలుడి తండ్రి అన్నారు.