సిమ్లా : ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి. తమ ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవును అమ్మిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో స్కూళ్లన్నీ విద్యార్ధుల కోసం ఆన్‌లైన్ క్లాస్‌ల బాట పట్టాయి. కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఈ క్లాస్‌లకు హాజరు కాలేకపోయారు. నాలుగో తరగతి, రెండో తరగతి చదువుతున్న తమ పిల్లలు ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవడంలో ఇబ్బందులు పడుతుండటంతో కుల్దీప్‌పై స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఒత్తిడి పెరిగింది. పిల్లలు చదువు కొనసాగించాలంటే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరని ఉపాధ్యాయులు సైతం కుల్దీప్‌కు సూచించారు.
స్మార్ట్‌ఫోన్ కొనేందుకు తాను బ్యాంకులు, వడ్డీవ్యాపారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని కుల్దీప్ వాపోయారు. దిక్కుతోచని పరిస్థితిలో కేవలం 6000 రూపాయల కోసం తన జీవనాధారమైన ఆవును అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జ్వాలాముఖిలో ఉంటానని, తనకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని కుల్దీప్ పేర్కన్నారు. ఆర్థిక సాయం కోసం తాను పలుమార్లు పంచాయితీని సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని కుల్దీప్ ది ట్రిబ్యూన్‌కు వెల్లడించారు. ఈ ఉదంతంపై జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా స్పందిస్తూ కుల్దీప్ కుమార్‌కు సత్వరమే ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment