
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మంత్రి కన్నుమూత
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి కరణ్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. కరణ్‌సింగ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వీరభద్రసింగ్ మంత్రివర్గంలో ఆయుర్వేద, సహకార శాఖల మంత్రిగా పనిచేయడంతో పాటు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వస్థలమైన కుల్లులో అంత్యక్రియలు జరిగాయి. ఆయన కాలేయం, గొంతుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్‌లో ఇటీవలే చేరారు.
కుల్లు రాజకుటుంబానికి చెందిన కరణ్ సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్‌కు స్వయానా తమ్ముడు. 1998-2003 మధ్య బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు 27 ఏళ్ల పాటు బీజేపీలో ఉన్న తర్వాత 2009లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2015లో కాంగ్రెస్ సీఎం వీరభద్రసింగ్ ఆయనను తమ కేబినెట్‌లోకి తీసుకున్నారు. కరణ్ సింగ్ మృతిపట్ల గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సంతాపం తెలిపారు.