లోకం మనల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినప్పుడు లోకానికి మనం ఏదైనా కొత్తగా చేసి చూపించాలన్న తపన మన లోలోపల ఎందుకని అంత అర్థరహితంగా రేయింబవళ్లూ జ్వలిస్తూ ఉంటుంది?! ‘‘ఇదిగో.. చాణక్యపురిలోని న్యాయ్‌మార్గ్‌లో ఉన్న ‘మానస సరోవర్–3’ లో నేనింకా జీవించే ఉన్నాను..’’ అని లోకానికి గుర్తు చేయడానికా? లేదంటే, లోకం మనల్ని నిర్దయగా పట్టించుకోవడం మానేయడం వల్ల కాలం మనకు సమకూర్చిన అమూల్యమైన సమయాన్ని అంతకంతా సద్వినియోగం చేసి, ఆ సద్వినియోగ ఫలాన్ని లోకానికంతటికీ ప్రదర్శనకు పెట్టాలన్న ప్రతీకార భావన మనల్ని కొద్దిపాటిగానైనా స్థిమితంగా ఉండనివ్వక పోవడం వల్లనా? కారణం ఏదైనా నేనొక పొరపాటైతే చేశాను!
తొంభై రెండేళ్ల వయసులో ఒక మనిషి పొరపాటు పని చేస్తే ఏమనుకోవాలి? ఏమైనా అనుకోవచ్చు. చూపు సన్నగిల్లిందని, మాట మెత్తబడిందని, వినికిడి మందగించిందనీ, ఆలోచన పలచనయ్యిందనీ.. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నాలో చక్కగా పనిచేస్తూ ఉన్నప్పటికీ నేనెందుకు పొరపాటు చేసినట్లు?! తొంభై ఏళ్లు దాటిన వయసంటే.. నిరక్షరాస్యుడిని సైతం వేదవ్యాసుడిగా మార్చేసేటంతటి జీవితం! మరి ఇతిహాసాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన మనిషి ఇంకెంతలా మారి ఉండాలి! అసలు పొరపాటన్నదే చేయలేనంతగా కదా. కానీ నేను చేశాను.
తొంభై రెండేళ్ల వయసుండీ; ఇతిహాసాలను, ఉపనిషత్తులను చదివి ఉండీ, పుస్తకం రాయడం అనే ఒక పెద్ద పొరపాటు చేశాను! పుస్తకం రాస్తున్నప్పుడు అనిపించ లేదు, పుస్తక ఆవిష్కరణప్పుడు అనిపించింది.. రాసి పొరపాటు చేశానని. ముండకోపనిషత్తుపై నేను రాసిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.
‘‘ధన్‌ఖడ్‌జీ.. నేనొక పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలి..’’ అని మొదట నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు ధన్‌ఖడ్.. పుస్తకం పేరేమిటని అడగలేదు!
‘‘ధన్‌ఖడ్‌జీ.. మీరు అనుమతిస్తే కనుక నా పుస్తకం పేరేమిటో కూడా మీకు ఇప్పుడే తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను..’’ అన్నాను. అప్పుడైనా ఆయన ‘‘సరే, చెప్పండి..’’ అనలేదు!
ఉపరాష్ట్రపతి నివాస్‌లో పుస్తకావిష్కరణ జరిగింది. ‘‘పుస్తకం బాగుంది కరణ్‌జీ..
‘ముండకోపనిషత్తు’ పైన కదా రాశారు..’’ అన్నారు ధన్‌ఖడ్.. పేజీలను తిరగేస్తూ.
ముండకోపనిషత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి ఉండదు. రాహుల్‌గాంధీ అసలే
ఉండరు. ‘సత్యమేవ జయతే‘ అని మాత్రమే చెబుతుంది ముండకోపనిషత్తు.
కానీ ధన్‌ఖడ్ రాహుల్‌గాంధీ గురించి మాట్లాడారు! రాహుల్ లండన్ వెళ్లి ఇండియా పార్లమెంటును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే రాజ్యాంగ విలువల్ని ఎవరు కాపాడతారు?’’ అని అడిగారు! ‘‘పార్లమెంటుకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఎలా విస్మరించగలను?’’ అని అన్నారు.
నా పుస్తకావిష్కరణకు నేను ధన్‌ఖడ్‌ను ఎంచుకుంటే, రాహుల్‌పై మండిపడేందుకు ధన్‌ఖడ్ నా పుస్తకావిష్కరణను ఎంచు కున్నారా?! ఐనా పుస్తకం రాయడం అనే పొరపాటును నేనెందుకు చేసినట్లు!!
1967లో నేను కాంగ్రెస్‌లో చేరాను. ఇప్పుడూ కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కానీ కాంగ్రెస్‌కు నేనేమీ కాను. వర్కింగ్ కమిటీ లోనూ లేను. నన్నెవరూ ఏదీ అడగరు. ఏదీ నాకు చెప్పరు. పార్టీలో నేనిప్పుడు ఒక జీరో.
పార్టీ నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని చెప్పి పార్టీకి నేనేదైనా కొత్తగా చేసి చూపించాలని తపించడం వల్లనే పుస్తకం రాయడం అనే ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరిగి ఉంటుందా?!
కరణ్ సింగ్ (సీనియర్ మోస్ట్ లీడర్) రాయని డైరీ
Published Sun, Mar 12 2023 1:08 AM | Last Updated on Sun, Mar 12 2023 1:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment