ఆస్పత్రుల పరిస్థితి దయనీయం
తమిళనాడులో వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం కొద్దిగా తెరిపి ఇవ్వగానే నర్సులు, ఇతర సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. కానీ, వాళ్లు మళ్లీ తిరిగి ఆస్పత్రులకు చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు గోడలు కూలి, ఇతర కారణాల వల్ల చాలామంది క్షతగాత్రులు ఆస్పత్రులకు వెళ్తున్నా, అక్కడ చికిత్స అందించే పరిస్థితి కనిపించడంలేదు. తాను కష్టమ్మీద ఇంటికి చేరుకునేసరికి ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయని.. దాంతో సర్టిఫికెట్లు తీసుకుని దగ్గర్లో ఉన్న ఓ స్కూల్లో ఆశ్రయం పొందుతున్నానని ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే మారిముత్తు అనే మేల్ నర్సు చెప్పారు. ఆయన భార్య కూడా నర్సుగానే పనిచేస్తున్నారు. ఆమె మాత్రం ఎలాగోలా ఎగ్మోర్‌లో ఉన్న తన ఆస్పత్రికి వెళ్లారు గానీ మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు.
ఇక ఆస్పత్రుల్లో కూడా పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లలోకి డీజిల్ నిల్వలు కూడా అడుగంటిపోవడంతో చాలాచోట్ల లైట్లు కూడా వెలగడం లేదు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం సిబ్బంది అందరినీ సిద్ధంగా ఉంచారు. కీల్‌పాక్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోకి నీళ్లు చేరుకున్నాయి. వాటిని మోటార్లతో తోడి బయటకు పంపుతున్నట్లు డీన్ నారాయణ బాబు తెలిపారు.
రోడ్లు మొత్తం పాడవ్వడం, అన్నిచోట్లా నీళ్లు ప్రవహిస్తుండటంతో అంబులెన్సు డ్రైవర్లు రోగులను ఆస్పత్రులకు తీసుకురావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 20 నిమిషాల్లో వెళ్లిపోయే దూరానికి కూడా ఇప్పుడు 40 నిమిషాలకు తక్కువ పట్టడం లేదని 108 అంబులెన్సు డ్రైవర్లు వాపోతున్నారు. మీనంబాకం లాంటిచోట్ల ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంది. తాంబరం ప్రాంతానికి అదనంగా 5 అంబులెన్సులను కేటాయించామని, ముందుగా గర్భిణులను తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి ప్రభుదాస్ చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో సాధారణం కంటే వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు.