మద్యానికి రాజధాని ఏ నగరమో తెలుసా?
వేల ఏళ్ళ చరిత్రకలిగిన.. సంస్కృతికి సాక్షీభూతమైన ప్రాంతం.. భారత్ లోని నాసిక్ పట్టణం. హిందూ తీర్థ క్షేత్రాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఇప్పుడు వైన్ రాజధానిగానూ వెలుగొందుతోంది. మహరాష్ట్ర లోని జిల్లా కేంద్రమైన నాసిక్ లో సూలా ద్రాక్షతోటలు, వైన్ పరిశ్రమలతోపాటు మరికొన్ని ప్రధాన వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో అక్కడ కొత్త ఒరవడిని తెచ్చింది. దీంతో నాసిక్ వైన్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
లిక్కర్ అమ్మకాల నిషేధంలో గుజరాత్ మహరాష్ట్రలు ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్నాయి. ఇటీవల కేరళ కూడ ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటిదాకా కుంభ మేళాకు ప్రసిద్ధి చెందిన మహరాష్ట్రలోని నాసిక్ ను తీర్థక్షేత్రంగానే భావించిన పర్యాటకులు.. క్రమంగా వైనరీ కేంద్రంగాను గుర్తిస్తున్నారు. దీంతో వైన్ టూరిజానికీ నాసిక్ ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సుమారు 50 వైన్ ఉత్పత్తి కేంద్రాలు నాసిక్ చుట్టుపక్కల వెలిశాయి. వాటిలోని కొన్నికేంద్రాల్లో వైన్ టేస్టింగ్ రూమ్ లను కూడ ఏర్పాటు చేశారు. వారాంతాల్లోనూ, విరామ సమయాల్లోనూ వచ్చే విధేశీ పర్యాటకులకోసం ఈ కొత్త సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. ఇది స్థానికులను సైతం ఆకట్టుకుంటోంది. అంతేకాక స్థానిక చట్టాన్ని సడలించాల్సిన స్థాయికి కూడ చేరేట్టు కనిపిస్తోంది.
నాసిక్ లో వైన్ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా... ఇప్పటికే అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. 'సూలా' సావినన్ బ్లాంక్, 'వల్లోన్' మాల్బెక్ డికాంటర్లు ప్రపంచ వైన్ అవార్డులను, పురస్కారాలను పొందాయి. వైన్ పరిమితంగా తీసుకోవడవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నది పూర్వకాలంనుంచీ తెలిసిన విషయమే. ద్రాక్షరసంతో తయారయ్యే వైన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. గుండె, ఎముకలను ధృఢపరచడమే కాక మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి కొన్ని రకాల రోగాలను కూడ రాకుండా చేస్తుంది. అందుకే వైన్ పరిశ్రమలకు కేంద్రమైన నాసిక్ ఇప్పుడు భారత వైన్ రాజధానిగా మారిపోయింది.