మహిళపై పోలీసు అధికారి జులుం..వీడియో హల్చల్
పట్నా: పేదవాళ్లపై, అభాగ్యులపై పోలీసులు దాష్టీకాలు పరిపాటిగా మారిపోయాయి ముఖ్యంగా మహిళలపై వారి అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బిహార్ రాజధాని పట్నా నగర వీధుల్లో ఇలాంటి అమానుషం ఒకటి వెలుగుచూసింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. మహిళపై ఓ పోలీసు అధికారి ప్రదర్శించిన జులుం, ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధి కారి మహిళపై దాడిచేసిన దృశ్యాలు,అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. స్థానిక మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించారు.
పాట్నాలోని స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతంలో నివసిస్తున్న గుడిసె వాసులపై ఒక బిల్డర్ తన అనుచరులతో దాడికి దిగాడు. ఆ స్థలంలో వారిని ఖాళీ చేయిల్సాందిగా హుకుం జారీ చేశాడు. ఈ క్రమంలో స్థానికులపై దాడికి దిగగా, అక్కడ వున్నవారంతా తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి రియల్ ఎస్టేట్ డెవలపర్ , మరికొంతమంది దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడున్న వారిపై విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేస్తూతమ ప్రకోపాన్ని ప్రదర్శించారు. అటు సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన సాక్షాత్తూ డిప్యూటీ సూపరింటెండెంట్ కైలాష్ ప్రసాద్ స్తానిక మహిళపై దారుణంగా హింసకు పాల్పడ్డాడు. అక్కడున్న పురుషుడిపై దాడిచేస్తుండగా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతన్న ఆమెను జుట్టు పట్టుకుని తోసేశాడు. పలుమార్లు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు డీజీపీ షాలిన్ చెప్పారు. వీడియో దృశ్యాలను పరిశీలించిన మీదట సంబంధిత చర్య తీసుకుంటామన్నారు.