ముంబై : పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వచ్చిన కార్మికులకు కరోనా మహమ్మారి రూపంలో పెను విపత్తు ఎదురైంది. లాక్‌డౌన్‌తో పనులు లేక అటు పల్లెకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక వలస కూలీలు కాలినడకనే మైళ్లకు మైళ్లు నడిచి ఊళ్లు చేరేందుకు ఉద్యుక్తులయ్యారు. కనిపించిన వాహనంలో ఇంటిబాట పడుతుండగా, వాహన డ్రైవర్లు ఇదే అదునుగా అందినకాడికి దండుకుంటున్నారు. ముంబై-నాసిక్ హైవే వలస కూలీల బాధలకు అడ్డాగా మారింది. సాధారణ రోజుల కంటే అధికంగా వాహనాలు ఈ హైవేపై బారులుతీరాయి. భౌతిక దూరం నిబంధనలను పాటించడం అటుంచి ఇల్లు చేరాలనే తపనే వారిలో కనిపిస్తుండగా ఇదే అదనుగా సొమ్ము చేసుకోవాలని ట్రక్కులు, ఆటోరిక్షాలు ఇతర వాహనాల డ్రైవర్లు పాకులాడుతున్నారు.
ముంబైలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే శత్రుఘ్న చౌహాన్ అనే కార్మికుడి కష్టాలు అక్కడి పరిస్థితికి అద్దం పడతాయి. కరోనా లాక్‌డౌన్‌తో ముంబైలో వ్యాపారాలన్నీ నిలిచిపోవడంతో పని కోల్పోయిన తాను యూపీలోని గోండా ప్రాంతానికి కుటుంబంతో సహా కలిసి వెళుతున్నామని చెప్పుకొచ్చాడు. రైలు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు నింపినా ఫలితం లేదని, దీంతో చిన్న పిల్లలను తీసుకుని రెండు బైక్‌లపై బయలుదేరామని , ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుడే తమను గమ్యం చేర్చాలని చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. విదేశాల్లో చిక్కుకున్న ప్రయాణీకులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతుండగా దేశంలో వలస కూలీలను వారి స్వస్ధలాలలకు చేర్చడాన్ని మాత్రం గాలికొదిలేసిందని వారంతా వాపోయారు.
చదవండి : ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..
ఇక మనర్‌లో ఫ్యాక్టరీలో పనిచేసే రమేష్ కుమార్ వసోయి వెళ్లందుకు కాళ్లనే నమ్ముకున్నాడు. ఫ్యాక్టరీలో ఎలాంటి వారు వస్తారో తెలియదని, వారి వల్ల తనకూ వైరస్ సోకుతుందనే భయంతో తల్లితండ్రులు గ్రామానికి రావాలని కోరారని రమేష్ తెలిపాడు. తమ గ్రామానికి చెందిన నలుగురం ఊరి బాట పట్టామని, ఇప్పటికే 220 కిమీ నడిచామని చెప్పుకొచ్చాడు. యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళ్లే వాహనంలో లిఫ్ట్ కోసం వారు పడిగాపులు కాస్తున్నారు. ఇంతదూరం నడవడంతో తన కాళ్లు బొబ్బలెక్కాయని ఇక నడవడం తన వల్ల కాదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వాహనంలో వెళదామన్నా రూ వేలు అడుగుతున్నారని, కాలి గాయానికి మందులకే తన వద్ద డబ్బు లేదని చెప్పుకొచ్చాడు. మహానగరాల్లో వలస కూలీలందరిది ఇదే పరిస్థితి కాగా మరికొందరు డబ్బులేక వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన సాగుతూ మధ్యలోనే పలువురు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక పగటి పూట భానుడి ప్రతాపం తాళలేక రాత్రివేళ స్వస్ధలాలకు పయనమవుతూ మార్గమధ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment