
భర్తను అంతమొందించిన భార్య
మాలూరు : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. ఈ ఘటన శనివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని షిమోగ జిల్లా మాలూరులోని మారుతీకాలనీకి చెందిన మహేంద్ర(23)ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. తల్లి, తండ్రితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. 8 నెలల క్రితం పట్టణంలోని గాంధీ సర్కల్‌లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి కుమార్తె పూజాను వివాహం చేసుకున్నాడు.
చదువకునే రోజుల్లో ప్రేమించిన సంపత్‌తో పూజా వివాహేతర సంబంధం కొనసాగించింది. మహేంద్ర లేని సమయంలో సంపత్ వచ్చి వెళ్లేవాడు. శనివారం మహేంద్ర ఆటో తీసుకుని బయటకు వెళ్లగా అతని తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లారు. ఈ సమయంలో సంపత్ పూజా ఇంటికి వచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేంద్ర ఇంటికి రాగా పూజా సంపత్‌ను మంచం కింద దాచి ఉంచింది. భర్త భోజనం చేసి పడుకున్న తరువాత సంపత్, పూజా కలిసి మహేంద్రను మారణాయుధాలతో దాడి జరిపి హత్య చేశారు. అనంతరం సంపత్ పరారు అయ్యాడు. ఈ ఘటన ఆదివారం వెలుగు చూడటంతో మాలూరు సీఐ రాఘవేంద్రన్, ఎస్‌ఐ చేతన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పూజాన అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.