సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించాక శనివారం హైదరాబాద్‌లో ఇరా ఆనందం
2010లో ఐఆర్‌ఎస్ సాధించిన ఇరా..
* వైకల్యం వల్ల పోస్టింగ్ ఇవ్వని సర్కారు
న్యూఢిల్లీ: ఈ ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో.. ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ మొదటి ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచారు. అయితే.. శారీరక అంగవైకల్యం గల ఇరాకు ఈసారైనా పోస్టింగ్ లభిస్తుందా లేదా అన్న సందేహం ఆమె కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉండటంతో..
ఆమె నివాసం వద్ద పెద్దగా సంతోషం, సంబరాలు కనిపించలేదు.
ఇరా సింఘాల్ 2010లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికయినప్పటికీ.. ఆమెకు పోస్టింగ్ లభించలేదు. తొలుత రెవెన్యూ విభాగమే ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు తిరస్కరించిందని.. తర్వాత ఆ శాఖ అంగీకరించినప్పటికీ.. శిబ్బంది, శిక్షణా విభాగం ఒప్పుకోలేదని ఆమె తండ్రి రాజేందర్‌సింఘాల్ పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన ఇరా.. 2014లో ఆ పోరాటంలో గెలిచారు. ఢిల్లీ ఎన్‌ఎస్‌ఐటీ (నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రురాలైన ఇరా.. ఎఫ్‌ఎంఎస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఆమె సాధారణ కేటగిరీలోనే రాశారు. తాజా ఫలితాలపై ఇరా స్పందిస్తూ చాలా సంతోషం వ్యక్తంచేశారు.
ఆశ్చర్యం...ఆనందం వేసింది
‘డిసాక్షి’తో సివిల్స్ ఆల్ ఇంయా ఫస్ట్ ర్యాంకర్ ఇరా
సాక్షి, హైదరాబాద్: ‘‘సివిల్స్ తుది ఫలితాల్లో అఖిల భారత స్థాయి లో మొట్టమొదటి ర్యాంకు సాధించానంటే నమ్మలేకపోతున్నా. ఒక్కసారిగా అవాక్కయ్యా. ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి. మాటల్లో చెప్పలేను’’ అని ఇరా సింఘాల్ శనివారం ‘సాక్షి’తో పేర్కొన్నారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఐఆర్‌ఎస్‌గా పనిచేస్తున్న ఆమె శిక్షణలో భాగంగా హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రానికి వచ్చారు. వికలాంగురాలైన తాను ఐఏఎస్‌గా వికలాంగుల అభ్యున్నతికి కషి చేస్తానన్నారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. హైదరాబాద్ వాతావరణం తనకెంతో నచ్చిందన్నారు.