రాంకిషన్ విషయంలో వెనక్కి తగ్గని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: 'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్'(ఓఆర్‌ఓపీ) పథకం అమలుతీరుతో ఆవేదన చెందిన మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్(70) ఆత్మహత్య చేసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై నిన్న (బుధవారం) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తమ పార్టీల నేతలతో కలసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టగా వారికి చేదు అనుభవమే ఎదురైంది. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మాజీ జవాను రాంకిషన్ కుటుంబాన్ని కలిసి తిరుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
నేడు జవాను రాంకిషన్ సొంతగ్రామానికి వెళ్లనున్నట్లు కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాను రాంకిషన్ స్వగ్రామం హరియాణాలోని భివానీ జిల్లా బామ్లా గ్రామం. జవాను కుటుంబసభ్యులను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి అండగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి నిన్న వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఓఆర్‌ఓపీ పథకం అమల్లో లోపాలను సరిచేయాలని రక్షణమంత్రిని కలిసి వివరించేందుకు మంగళవారం ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. జవానుగా సేవలందించిన రాంకిషన్ రిటైరైన తర్వాత గ్రామంలో పారిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు 2008లో రాష్ట్రపతి చేతుల మీదుగా 'నిర్మల్ గ్రామ్ పురస్కార్' అందుకున్నారు.
Will go to their village and meet Ram Kishan ji's family there today
— Arvind Kejriwal (@ArvindKejriwal) 3 November 2016