
కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్
- మహిళ అధికారిని కాపాడబోయి శవమైన ఐఏఎస్
న్యూఢిల్లీ: దేశంలో ఐఏఎస్‌లు వరుసగా మత్యువు బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ యువ ఐఏఎస్ అధికారి ఉత్తరప్రదేశ్‌లో శవమై కనిపించగా.. మంగళవారం దేశ రాజధానిలో ఓ ట్రైనీ ఐఏఎస్ మహిళా అధికారిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్‌లో ఉన్న ఆశీష్ దహియా(30) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇనిస్టిట్యూట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు.
ఇంతలో ఓ మహిళా అధికారి జారి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోవడంతో ఆమెను కాపాడటానికి కొందరు ట్రైనీ ఐఏఎస్‌లు అందులోకి దూకారు. వారిలో ఆశీష్ కూడా ఉన్నారు. ఆమెను రక్షించి మిగిలిన అధికారులు ఒడ్డుకు చేరుకోగా.. ఈత తెలియని ఆశీష్ నీటిలో మునిగిపోయారు. ఇది గుర్తించిన మిగిలిన వారు మరలా ఆశీష్ కోసం నీటిలోకి దూకారు. ఆశీష్‌ను ఒడ్డుకు చేర్చి మెడికల్ ఆఫీసర్‌కు సమాచారం అందించారు.
ఈలోగా ప్రాథమిక చికిత్స అందించినా ఆశీష్ ప్రాణాలు కాపాడులేకపోయారు. ఆసుపత్రికి చేరుకునే లోపే ఆశీష్ మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సమయంలో ఆశీష్ మద్యం సేవించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆశీష్ తోటి అధికారులు, స్నేహితుల నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు.