‘సహాయం’ చేయరా?
సాక్షి, చెన్నై: ఐఏఎస్ అధికారి సహాయం కమిటీకి సహకారం అందించరా? అని రాష్ట్ర ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ ఏర్పాటు ఉత్తర్వుల్లో జాప్యాన్ని ఖండిస్తూ తీవ్రంగా స్పందించిం ది. నాలుగు రోజుల్లో కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, కోర్టు సమయాన్ని వృథా చేసే విధంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.పది వేలు జరిమానా విధిస్తూ మంగళవారం హైకోర్టు ప్రధాన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రానైట్, దాతు ఇసుక కుంభకోణాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వేలాది కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి పడడంతో సమగ్ర విచారణ లక్ష్యంగా మద్రాసు హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ బండారాన్ని బయట పెట్టిన ఐఏఎస్ అధికారి సహాయంను తమ విచారణకు ఆయుధంగా చేసుకుంది. అయితే, సహాయం నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆ కమిటీని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురు కావడంతో మళ్లీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. సహాయం కమిటీ ఏర్పాటు గురించి పునఃపరిశీలన చేయాలంటూ కోర్టులో పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేసింది.
రిట్ పిటిషన్ : రాష్ట్రంలో గ్రానైట్ మాఫియాపై కొరడా ఝుళిపించే విధంగా, దాతు ఇసుకను పరిరక్షించే రీతిలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వివరిస్తూ మంగళవారం ఉదయం ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సహాయం కమిటీ ఏర్పాటు అవసరం లేదని, మరోమారు పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సహాయం కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చి నెలన్నర రోజులకు పైగా అవుతోంది. ఈ ఆదేశాల్ని నిలుపుదల చేయాల్సి వస్తే పదిహేను రోజుల్లోపు కోర్టును ప్రభుత్వం ఆశ్రయించాలి. అయితే, నేరుగా సుప్రీం కోర్టుకు వె ళ్లడం, అక్కడ చుక్కెదురు కావడంతో నెలన్నర రోజుల తర్వాత పునః సమీక్షకు రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, తీవ్ర ఆగ్రహంతో పాటుగా, అక్షింతలు వేసింది.
సహాయం చేయరా..!: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ సమక్షంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున న్యాయవాది సోమయాజులు హాజరయ్యారు. సహాయం కమిటీకి వ్యతిరేకంగా తన వాదనల్ని బెంచ్ ముందు ఆయన ఉంచారు. అయితే, ఆయన వాదనలను పరిశీలిస్తూనే, పలు రకాల ప్రశ్నల్ని బెంచ్ సంధించింది. సహాయం కమిటీతో ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటి?, ఆ కమిటీకి ఎందుకు సహకరించరు? తాము నియమించిన కమిటీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?, ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం ఎందుకు?, రిట్ పిటిషన్ దాఖలులోనూ జాప్యం ఏమిటి? ఇలా పలు రకాల ప్రశ్నల్ని బెంచ్ సంధించడంతో ఉక్కిరి బిక్కిరి కావాల్సిన వంతు ప్రభుత్వ న్యాయవాదికి తప్పలేదు. అరగంట పాటుగా వాదనలు సాగినానంతరం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని బెంచ్ వ్యక్తం చేసింది.
జరిమానా: నిర్ణీత సమయంలో కాకుండా, ఆలస్యంగా రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై కోర్టు మండిపడింది. ఈ జాప్యంతో కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.పది వేలు జరిమానా విధిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో సహాయం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారి సహాయంకు గట్టి భద్రత కల్పించాలని,ఆ కమిటీకి అవసరమయ్యే అన్ని సదుపాయూలు కల్పించాలని, సహాయం అంగీకారం మేరకు ఆకమిటీకి అధికారుల్ని, సిబ్బందిని నియమించి, నిధుల్ని సమకూర్చాలని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
మోట్టికాయతోనైనా.. : రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా రూపంలో హైకోర్టు మొట్టికాయ వేయడం, ఆహ్వానించాల్సిన విషయమని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పేర్కొంటూ, రాష్ట్రంలో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోందని ఆరోపించారు. అందుకే తాను కోర్టును ఆశ్రయించానని, ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు వేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహాయం కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.