కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు  | ICMR sits on proposal to try Rs 5 arthritis drug for Covid19 cases | Sakshi
Sakshi News home page

కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు 

Published Tue, May 26 2020 9:45 AM | Last Updated on Tue, May 26 2020 3:51 PM

 ICMR sits on proposal to try Rs 5 arthritis drug for Covid19 cases - Sakshi

సాక్షి,  చెన్నై:  కరోనా  వైరస్ వల్ల సంభవించే  మరణాలను నిరోధించగలిగే అతి చవకైన మందును  ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  (ఐసీఎంఆర్) ట్రయల్స్ కోసం పరిశీలించనుంది. కరోనా బాధితుల మరణాలకు కారణంగా భావిస్తున్న సైటోకిన్ ఉధృతిని ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఔషధం ఇండోమెథాసిన్ ఉపయోగపడుతుందని చెన్నైకి  చెందిన  వైద్య నిపుణుడు డాక్టర్  రాజన్ రవిచంద్రన్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్రయల్స్ కోసం తన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ తోపాటు, అమెరికా, కెనడా దేశాలకు ఏప్రిల్ 29 న  పంపించారు.  దీనిపై స్పందించిన యూకే విభాగం వీటిని తమ చికిత్సా టాస్క్ ఫోర్స్ కు పంపించినట్టు తెలిపింది. 

కిడ్నీ మార్పిడి రోగుల్లో సైటోకిన్ తీవ్ర ప్రభావాన్ని ఆపడానికి ఇండోమెథాసిన్ ఉపయోగించిసఫలమైనట్టు కిడ్నీ మార్పిడి సర్జన్ రవి చంద్రన్ తెలిపారు. కోవిడ్-19 బాధితులపై దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చని డాక్టర్ రవిచంద్రన్ సూచించారు. అయితే ఆశాజనక ఫలితాలకు పెద్ద ఎత్తున నిర్వహించే మెడికల్ ట్రయిల్స్ కీలకమన్నారు. ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ధర కేవలం  రూ. 5  మాత్రమే.  మరోవైపు  కోవిడ్-19 రోగుల్లో ఇప్పుడు ఉపయోగించే  టోసిలిజుమాబ్  ఒక మోతాదు ధర రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. (హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్రయల్స్‌పై తాత్కలిక నిషేధం: డబ్ల్యూహెచ్‌ఓ)

ఇలాంటి 185 ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం  బయోటెక్నాలజీ విభాగంలోని నిపుణులు,  కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ అనాలిసిస్ తో కలిసి ఐసీఎంఆర్ ఒకదాని తరువాత మరొక ప్రతిపాదనను పరిశీలిస్తోందన్నారు.

మరోవైపు హైడ్రాక్సిక్లోరోక్విన్ కంటే ఇండోమెథాసిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని బ్రూక్లిన్‌లోని ఒక ప్రధాన వైద్యుడు డాక్టర్ జోనాథన్ లీబోవిట్జ్ ప్రకటించారు. దాదాపు 60 మంది కరోనా రోగుల్లో సాధారణంగా కంటే ఎక్కువగా ఇది  సమర్థవంతంగా పనిచేసినట్టు తెలిపారు. అలాగే ఈ  ఔఫధానికి కావాల్సిన ప్రాముఖ్యతనివ్వడం లేదని కూడా పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోందనీ, కానీ దీనిపై అదనపు పరిశోధనలు అవసరమని  ఆయన సూచించారు.

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ నివారణకు యాంటి మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ పనిచేస్తుందని..తాను వాడి చూశానని ప్రకటించగా,  హైడ్రాక్సీక్లోరోక్విన్‌  క్లినికల్ ట్రయల్స్  తాత్కాలికంగా  నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement