
న్యూఢిల్లీ: ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్) విధ్వంసాలు, బాంబు పేలుళ్ల సంఖ్య పెరిగిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఒక్క 2018లోనే ఇలాంటి ఘటనలు 57 శాతం పెరిగినట్లు పేర్కొంది. మావోయిస్టు ప్రాబల్య ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి తరహా దాడులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ఇటీవల ఢిల్లీలో ముగిసిన సదస్సులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ)కి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్‌బీడీసీ) ఈ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు..
జమ్మూ కశ్మీర్‌లో 2014లో ఐఈడీ దాడుల సంఖ్య 37 కాగా..2015లో 46, 2016లో 69, 2017లో 70, 2018లో 117గా నమోదయ్యాయి. కశ్మీర్ మినహా దేశమంతటా బాంబు పేలుళ్ల ఘటనలు తగ్గుముఖం పట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018కి ఐఈడీ పేలుళ్లు 98 నుంచి 77కు తగ్గగా, కశ్మీర్‌లో మాత్రం 57 శాతం పెరిగాయి. అయితే, 2017తో పోలిస్తే గతేడాది కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో ఎదురుదెబ్బలు తిన్న ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు భద్రతా బలగాలను ఎదుర్కోలేక ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. 2018లో నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్ల కారణంగా 55 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మొత్తం ఐఈడీ మృతుల సంఖ్య కన్నా ఈ సంఖ్య సగం కన్నా ఎక్కువ. ఈశాన్య ప్రాంతాలతో పోలిస్తే మరణాలు నమోదుకాని దాడుల సంఖ్య కూడా కశ్మీర్‌లో పెరిగింది.