వారణాసిలో ఓడితే, ప్రధాని పీఠానికి మోడీ దూరం!
వారణాసి: వారణాసి ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. వారణాసిలో మోడీని ఓడిస్తే.. ప్రధాని పదవికి ఎవరూ పరిగణనలోకి తీసుకోరని కేజీవాల్ ఓటర్లకు సూచించారు. అంతేకాకుండా బీజేపీ కూడా ఖతమవుతుందని ఆయన అన్నారు.
వారణాసిలో ఓడిపోతే మోడీ ప్రధాని కారని పదే పదే ఓటర్లకు చెప్పారు. మే 16న ముగిసే ఎన్నికల తర్వాత వారణాసిని వదిలేసి.. 17న మోడీ వడోదరకు వెళ్లిపోతారని ఆయన అన్నారు. ఆతర్వాత వారణాసికి రాజీనామా చేసి వడోదరకే పరిమితమవుతారని ఆయన అన్నారు.
ప్రధాని అయితే వారణాసిని అభివృద్ధి చేస్తానని మోడీ అంటున్నారని.. ఇప్పటి వరకు ప్రధానమంత్రులైన నెహ్రూ, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్ పేయి వారివారి నియోజకవర్గాలను అభివృద్ది చేశారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వాజ్ పేయి లక్నోను అభివృద్ధి చేశారా అంటూ ఓటర్లను అడిగారు.