కప్ వాలా, క్యాప్ వాలా - గెలుపెవరిది
ఈ లోకసభ ఎన్నికలు కప్ కీ, క్యాప్ కీ మధ్య పోటీ గా చరిత్రలో మిగిలిపోతుంది. నరేంద్ర మోడీ చాయ్ వాలాగా ముందుకొస్తే, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ టోపీతో ముందుకొచ్చారు. ఇద్దరూ మచ్చలేని నేతలుగా, మంచి పాలకులుగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ చివరికి ఎన్నికల కప్ గెలుచుకుంది కప్ వాలాయే. క్యాప్ వాలాకి టోపీ మాత్రమే మిగిలింది.
కప్ వాలా - నరేంద్ర మోడీ తనను తాను సామాన్యుడిగా చూపించుకునేందుకు చిన్నప్పుడు సొంతూరు వడ్ నగర్ లో చాయ్ దుకాణంలో చాయ్ అమ్మిన సంగతిని హైలైట్ చేసుకున్నారు. తాను రాహుల్ గాంధీలా రాచబిడ్డను కానని చెప్పుకునేందుకు ఆయన రాహుల్ ను షహజాదా అని, కాంగ్రెస్ ను తల్లీ బిడ్డల సర్కారు అని విమర్శించారు. మరో వైపు చాయ్ పే చర్చ పేరిట దేశ వ్యాప్తంగా సదస్సుల నిర్వహించారు. ఒక్క రోజునే దేశమంతటా 500 చాయ్ పే చర్చలు నిర్వహించారు. త్రీడీ హోలోగ్రామ్ టెక్నాలజీతో ఆయన లక్షలాది మంది వద్దకు చేరుకోగలిగారు.
క్యాప్ వాలా - మోడీ లాగే సామాన్యుడిలా ముందుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన తెల్ల టోపీ రాజకీయాల్లో ఒక సింబల్ గా మారింది. దీనికి పోటీగా అన్ని పార్టీలూ తమ తమ టోపీలను బయటకు తీయాల్సి వచ్చింది. చిన్న టవల్ కట్టుకుని గంగలో స్నానం చేసినా, చలిలో మఫ్లర్ కట్టుకుని ఢిల్లీలో తిరిగినా ఆయన సామాన్యుడి ఇమేజినే ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.
అయితే కప్పుకి, క్యాప్ కీ ఒక్క తేడా ఉంది. క్యాప్ ప్రశ్నలు లేవనెత్తడంతో సరిపుచ్చారు. మోడీ జవాబులు సూచించేందుకు ప్రయత్నించారు. వీరిద్దరిలో గెలుపెవరిదో ఇంకా చెప్పాలా?