జలంధర్: పంజాబ్ లో పెరిగిపోయిన మత్తు పదార్థాల వినియోగం, శాంతి భద్రతల క్షీణతపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
నాయకత్వంలో పంజాబ్ లోని జలంధర్ లో ఆపార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమానికి హాజరైన రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించనంత వరకు ప్రగతి సాధ్యం కాదన్నారు. ఈ విషయం చెబితే అకాలీదల్ ప్రభుత్వం తనను వెక్కిరిస్తోందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించేంత వరకు తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సినిమాలు సైతం నిషేధిస్తున్నారని, నిజం మాట్లాడితే కూడా తట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఉడ్తా పంజాబ్ సినిమాను రాహుల్ ప్రస్తావించారు.
మాదక ద్రవ్యాలు, నిరుద్యోగం, శాంతిభద్రతలు ఈ మూడు సమస్యలతో రాష్ట్రం సతమతమౌతోందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో అధికారం ఒక్కరి చేతిలో కేంద్రీకృతమైవడమే ఈసమస్యకు కారణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారపార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాణా గుర్జీత్ సింగ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.