Better future
-
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్‌గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్‌కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
నీటి బొట్టు.. ఒడిసి పట్టు
సాక్షి, మహబూబాబాద్ :: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు. తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు,కుంటల్లో నీరు ఇంకిపోతోంది. ప్రాజెక్టులు అడుగంటాయి. భూగర్భ జలాలు పాతాలానికి పడిపోతున్నాయి.అసలే వేసవి కావడంతో మండుతున్న ఎండలతో బోరుబావులు, ఎండిపోతున్నాయి. దీంతో తాగు నీటి సమస్య రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే గాని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు. నీటి సంరక్షణ కోసం చేపటాల్సిన కార్యక్రమాన్ని వివరించేందుకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. వృథాగా పోతున్న నీళ్లు ప్రతి గ్రామంలో మంచినీటి కులాయిలు, తాగునీటి నల్లాలు, పైపులైన్ల లీకేజీల వద్ద పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. మనం భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియోడిజెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ (యుఎన్సీఈడీ ) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా 2010 సంవత్సరాన్ని ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం పరిశుభ్రమైన నీరు అనే నిర్దిష్ట భావనతో నీటి పొదుపుకు సంబంధించిన సూత్రాలను పాటించాలని సూచిస్తోంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30–50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. ఇప్పటికీ 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు. చాలామందికి స్వచ్ఛమైన నీరు దొరకక వ్యర్థమైన నీటినే వినియోగించి పలు రోగాల పాలవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న దిశా సంస్థ.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దిశ సేవా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, చేపడుతోంది. ప్రతీ వేసవి కాలం నీటి ఎద్దడి, వాడుకునే విధానం, మంచినీటి అవసరాలపై మానుకోట జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సంస్థ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటిని వృథా చేయొద్దు.. ముందు తరాలకు అందిద్దామని సూచనలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతి , కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్న తీరును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ రంగంలో నీరు ప్రధానమైనది. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటిని పొదుపుగా వాడుకుంటేనే శ్రేయస్కరమని, భవిష్యత్ తరాలకు అందేలా కృషి చేయాలని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. మొక్కలు నాటాలి ఖాళీ స్థలంలో విడివిడిగా మొక్కలు నాటాలి. ఉన్న చెట్లను పరిరక్షించాలి. ఈ చర్యల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చవచ్చు. దీంతో సకా లంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటల నిండా నీళ్లు ఉంటాయి. తద్వారా నీరు ఇంకిపోకుండా వేసవి కాలంలో ఉపయోగపడుతాయి. – దైద వెంకన్న, వన ప్రేమికుడు, మానుకోట -
డ్రగ్స్ ను నిర్మూలిస్తేనే ప్రగతి: రాహుల్ గాంధీ
జలంధర్: పంజాబ్ లో పెరిగిపోయిన మత్తు పదార్థాల వినియోగం, శాంతి భద్రతల క్షీణతపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పంజాబ్ లోని జలంధర్ లో ఆపార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమానికి హాజరైన రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించనంత వరకు ప్రగతి సాధ్యం కాదన్నారు. ఈ విషయం చెబితే అకాలీదల్ ప్రభుత్వం తనను వెక్కిరిస్తోందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించేంత వరకు తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సినిమాలు సైతం నిషేధిస్తున్నారని, నిజం మాట్లాడితే కూడా తట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఉడ్తా పంజాబ్ సినిమాను రాహుల్ ప్రస్తావించారు. మాదక ద్రవ్యాలు, నిరుద్యోగం, శాంతిభద్రతలు ఈ మూడు సమస్యలతో రాష్ట్రం సతమతమౌతోందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో అధికారం ఒక్కరి చేతిలో కేంద్రీకృతమైవడమే ఈసమస్యకు కారణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారపార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాణా గుర్జీత్ సింగ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
దేవాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్
యాదగిరికొండ, న్యూస్‌లైన్, తెలంగాణలోని దేవాలయాలకు, ఆలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్ ఉందని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జి.దేవీప్రసాద్ అన్నారు. యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీత భవనంలో సంయుక్త కమిషనర్ దేవాల యాలు, ఉప సహాయక కమిషనర్ దేవాలయాల ఉద్యోగుల ఐక్యకారచరణ సమితి ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో ఆలయ ఉద్యోగుల పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. ఆ త్యాగాలను వచ్చే తెలంగాణ ప్రభుత్వం మరిచిపోదని గుర్తు చేశారు. ప్రతి తెలంగాణ ఉద్యోగి బిడ్డలందరూ సుఖసంతోషాలతో ఉండాల్సిన అవ సరం ఉందని అన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ వ్వవస్థను రద్దు చేసి ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. దేవాలయాల ఉద్యోగుల సమస్యలు తీర్చకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్చకులు చేసిన యజ్ఞ, యాగాదులు కూడా తెలంగాణ ఏర్పాటుకు దోహదమయ్యాయని అన్నారు. ఏఈఓ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చే సుమారు రూ.5 కోట్ల మొత్తాన్ని సీఎం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అందజేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హడావిడిగా పోలవరం ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాలలో సుమారు 10 వేల మంది ఉద్యోగులున్నారని, వారి భవితవ్యం ఏంకావాలని కేంద్రం భావిస్తుందని దేవీప్రసాద్ ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలల్లో తమ వాణిని వినపించేందుకు ఎంపీగా పోటీలో ఉండాలని దేవీప్రసాద్‌ను కోరుతూ దేవాలయ ఉద్యోగులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ సూచనల మేరకే ఏమైనా జరుగుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు కొందరు నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉద్యోగాలను పొందారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఎన్జీఓ రాష్ట్ర కార్యద ర్శి కారం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల జేఏసే చెర్మైన్ గజ్వెల్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీదే భవిష్యత్తు
జహీరాబాద్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీకే మంచి భవిష్యత్తు ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జహీరాబాద్‌లోని అతిథి హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. అనంతరం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక మంది పార్టీలో వచ్చి చేరనున్నారన్నారు. తెలంగాణలో సైతం పార్టీ ఎవరూ ఊహించని విధంగా బలపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు అందించిన ఫలాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఎవరూ చేయని విధంగా పేదలకు రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు. రాజశేఖరరెడ్డి రోజులను స్వర్ణయుగంగా ప్రజలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. తిరిగి అలాంటి పాలన ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం పార్టీ ఆశించిన మేరకు విజయావకాశాలను సాధిస్తుందన్నారు. న్యాల్కల్ మండలంలోని గణేష్‌పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్, రవి, రాజు, జయప్ప, తుకారాంలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఉజ్వల్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అతార్ అహ్మద్, రాంరెడ్డి, ముబీన్, సమి, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
పాపగా పుట్టింది పాటగా ఎదిగింది
పుట్టిన బిడ్డకు చూపు లేకపోతే జన్మనిచ్చినవాళ్లకు లోకం అంధకారం అవుతుంది. శ్రావ్య అమ్మానాన్నలను కూడా... కొన్నాళ్ల పాటు అదే చీకటి అలుముకుంది! కానీ, శ్రావ్య తన పాటతో.... వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపింది. పాప పాడగలదని కనిపెట్టిన క్షణం నుంచీ... సుజాత, సుదర్శన్... ఆమెను చక్కని గాయనిగా శృతి చేయడానికి, చదువుల తల్లిగా తీర్చిదిద్దడానికి... రేయింబళ్లు పాపే లోకంగా బతికారు. పాపగా పుట్టిన శ్రావ్యను పాటగా పెంచిన ఈ తల్లిదండ్రుల ప్రేమ, ప్రయాసలే ఈవారం ‘లాలిపాఠం’. ‘మీ అమ్మాయి ఇంత శ్రావ్యంగా పాడుతుందని ఊహించే ఆ పేరు పెట్టారా’ అని సుజాత, సుదర్శన్‌లను అడిగినప్పుడు... ‘‘శ్రావ్య మూడేళ్ల వయసులో హమ్ చేస్తూ ఉండేది. తనకు పాట వస్తే బావుణ్ననే ఆశ నాలో అప్పుడే కలిగింది. ఎందుకంటే పాప విజువల్లీ చాలెంజ్డ్ కిడ్ అని తెలిసిన తర్వాత మేము పడిన మానసిక సంఘర్షణ ఒకెత్తయితే, తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏం చేయగలం అనే పెద్ద ప్రశ్నార్థకం మా ముందు ఉండేది అప్పట్లో. ఏం చేస్తే తనకంటూ మంచి జీవితాన్ని ఇవ్వవచ్చో తెలియక పదహారేళ్లుగా నలిగిపోతూనే ఉన్నాం. పాపను పెంచడంలో ఎదురైన చేదు అనుభవాలు ఎలాగైనా సరే తనని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలనే కసిని నాలో పెంచాయి’’ అని సుజాత తన జీవనపోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పటి శ్రావ్య కాదు! ‘‘ఇప్పుడు మీరు చూస్తున్న శ్రావ్య ఒకప్పటి శ్రావ్య కాదు. దాదాపుగా సెవెన్త్, ఎయిత్ క్లాసుల వరకు తను చాలా ఇంట్రావర్ట్. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు... ఈ ఆరుగురు తప్ప మరో వ్యక్తి ఉంటే నోరు తెరిచేది కాదు. రాయిలా బిగుసుకుపోయేది. స్టేజి మీద పాడేటప్పుడు కూడా వణికిపోయేది. సైకాలజిస్ట్ జాన్ హేమంత్‌కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చి విపశ్శన ధ్యానసాధన చేయించారు. అది మొదలు తనలో వచ్చిన మార్పుకు మేమే ఆశ్చర్యపోయాం’’ అంటారు సుదర్శన్. ‘‘మరొకరి మీద ఆధారపడడాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది- అని చెప్తుండేవాడిని. అలాగే తను ప్రతిదీ సొంతంగా నేర్చుకుంటోంది.’’ అంటూ మురిసిపోయారు. అన్నికష్టాలనూ ఎదుర్కొన్నాం! ‘‘చాలెంజ్డ్ కిడ్ని పెంచడంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలనూ , సవాళ్లనూ ఎదుర్కొన్నాం. వెజాగ్లో చాలా స్కూళ్లు శ్రావ్యను చేర్చుకోవడానికి నిరాకరించాయి. చివరికి ‘చిప్ అండ్ డేల్’ స్కూలు వాళ్లు చేర్చుకున్నారు. అయితే సమాజం నుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతుండేవి. ముందుగా తనని కలుపుకునే వాతావరణంలోకి మారాలని హైదరాబాద్‌కు వచ్చాం. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా రోజుకో రకమైన పరీక్షలు ఎదురయ్యాయి. మా వారికి ఉద్యోగం వెతుక్కోవడం పెద్ద సమస్య అయింది. చివరికి మా వారికి బెంగళూరులో ఉద్యోగం వచ్చిన తర్వాత రొటీన్ ఖర్చుల భయం తప్పిపోయింది. కానీ అప్పటికీ శ్రావ్యకు మంచి ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలంటే ఈ డబ్బు చాలదనే ఆందోళన ఉండేది’’ అన్నారామె ఉద్విగ్నంగా. తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం! ఆర్థికంగా స్థిరపడడమే అనేక సమస్యలకు సమాధానం అయిందంటారు సుదర్శన్. ‘‘ఆ పరిస్థితుల్లో మరో మార్గం లేదు. కేవలం డబ్బు సంపాదించడానికే కుటుంబాన్ని వదిలి ఫారిన్ వెళ్లాను. ఇప్పుడు మీరు చూస్తున్న శ్రావ్యను తయారుచేయడానికి మేమిద్దరం మా బాధ్యతలను రెండు రకాలుగా పంచుకున్నాం. హోమ్ట్యూషన్లకు మాత్రమే కాదు, ప్రతిచోటా సాధారణంకంటే ఎక్కువ ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేయలేకపోతే తననిలా తయారు చేయడం సాధ్యం కాదు. నేను డబ్బు సంపాదనలో ఉంటే సుజాతహైదరాబాద్లో పాపను చదివించుకుంటూ, సంగీతం నేర్పిస్తూ ఉండేది. అన్నింటికంటే ఎక్కువగా శ్రావ్యను వ్యక్తిత్వపరంగా తీర్చిదిద్దడానికి చాలా కష్టపడింది’’ అన్నారు. నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను! ‘‘శ్రావ్యను చిన్న క్లాసుల్లో బ్రెయిలీలో చదివించాం. సిలబస్ పెరిగిన తర్వాత నేను టెక్ట్స్ బుక్ మొత్తం చదివి రికార్డు చేసేదాన్ని. శ్రావ్యకు ఎయిత్‌క్లాస్ నుంచి ల్యాప్‌టాప్ వాడడం నేర్పించాం. మా వారు బుక్‌ని వాయిస్ రికార్డు వెర్షన్లో స్కాన్ చేసేవారు. వాటిని విని పాఠాలు నేర్చుకునేది. కానీ ఇంతకంటే పెద్ద కష్టం చిన్నప్పటిదే. వైజాగ్ నుంచి నెలకోసారి హైదరాబాద్‌కొచ్చి ఎల్విప్రసాద్ ఇన్స్టిట్యూట్లో క్లాసులకు హాజరయేదాన్ని. విజువల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ఏ విషయాన్ని ఎలా నేర్పించాలనే విషయంలో శిక్షణ ఇచ్చేవాళ్లు. నేను నేర్చుకుని దానిని శ్రావ్యని పెంచడంలో అమలు చేయాలి. నేను కరెక్ట్‌గా నేర్చుకోకపోతే పాపకు సరిగ్గా నేర్పించలేననే భయంతో ప్రతిరోజూ నన్ను నేను అప్డేట్ చేసుకోవడంతోనే సరిపోయేది. ఇప్పుడు గుర్తుచేసుకోబోతే నా జీవితంలో ప్రశాంతంగా సాగిన ఘట్టం ఇదీ అని ఒక్కటి కూడా గుర్తుకురావడం లేదు. శ్రావ్య కోసం పెట్టిన పరుగులే గుర్తుకొస్తున్నాయి’’ అన్నారు సుజాత. తనకు తానుగా నడవాలని... ‘పాటల పోటీల్లో చాలామంది పిల్లలు శ్రావ్యతో పోటీపడి గెలవడమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు... అంటే శ్రావ్యను పెంచడంలో, తనను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడంలో మేము సక్సెస్ అవుతున్నామనే సంతోషం కలుగుతోంది’- అంటున్నారు సుదర్శన్. ‘‘శ్రావ్యలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నాసర్ స్కూల్లో లెవెన్త్, ట్వెల్త్ క్లాసులు చదువుతున్నప్పుడు ప్రిఫెక్ట్‌గా, కల్చరల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. కాలేజ్‌లో ఫ్రెండ్స్‌ని ‘నా చేతిని ఎవరూ పట్టుకోవద్దు. నాకు నేనుగా నడుస్తాను, కరెక్ట్‌గా వెళ్తున్నానా లేదా అనేది మాత్రం చూసి చెప్పండి’ అని అడుగుతుందట. వీటికి కారణం తన మీద తనకు ఏర్పడిన నమ్మకమే. ఆ నమ్మకం కలిగించడంలో మేము విజయవంతం కావడానికి ఇన్నేళ్లు పట్టింది’’ అన్నారాయన. ‘‘శ్రావ్య పెళ్లి గురించి ఇంట్లో సరదాగా మాట్లాడుతుంటాం. కానీ ఎంబిఏ పూర్తయిన తర్వాతే ఆలోచిస్తాం అన్నారు సుజాత. భవిష్యత్తులో తనకు తోడుగా మేము ఉన్నా లేకపోయినా తనకు తాను స్థిరంగా జీవించగలగాలి. అందుకే చదువునీ, సంగీతాన్ని బాలెన్స్ చేస్తూ పెంచుతున్నాం. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని కలిగిస్తున్నాం’’ అన్నారామె. శ్రావ్యను గాయనిగా, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ఈ దంపతులు పడిన శ్రమకు గౌరవ వందనం చేయాలనిపిస్తుంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి శ్రావ్య గురించి... చదువు వైజాగ్‌లోని చిప్ అండ్ డేల్ స్కూల్ హైదరాబాద్‌లోని మారిక ఇంటర్నేషనల్ స్కూల్, నాసర్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్‌లో బికామ్, సిఏ చేస్తున్నారు. ప్రత్యేకతలు ముంబయి యూనివర్శిటీ నుంచి కర్నాటక సంగీతంలో సర్టిఫికేట్ కోర్సు చేశారు తెలుగు యూనివర్శిటీ నుంచి కర్నాటక సంగీతం డిప్లమో కోర్సు చేస్తున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి కపిల్‌సిబల్ చేతుల మీదుగా ‘జూనియర్ ఎక్స్‌లెన్స్ 2013’ పురస్కారం అందుకున్నారు.