పాపగా పుట్టింది పాటగా ఎదిగింది | Child born in the song went on to become | Sakshi
Sakshi News home page

పాపగా పుట్టింది పాటగా ఎదిగింది

Published Mon, Aug 19 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM

పాపగా పుట్టింది పాటగా ఎదిగింది

పాపగా పుట్టింది పాటగా ఎదిగింది

 పుట్టిన బిడ్డకు చూపు లేకపోతే జన్మనిచ్చినవాళ్లకు లోకం అంధకారం అవుతుంది.
 శ్రావ్య అమ్మానాన్నలను కూడా...
 కొన్నాళ్ల పాటు అదే చీకటి అలుముకుంది!
 కానీ, శ్రావ్య తన పాటతో....
 వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపింది.
 పాప పాడగలదని కనిపెట్టిన క్షణం నుంచీ...
 సుజాత, సుదర్శన్...
 ఆమెను చక్కని గాయనిగా శృతి చేయడానికి, చదువుల తల్లిగా తీర్చిదిద్దడానికి...
 రేయింబళ్లు పాపే లోకంగా బతికారు.
 పాపగా పుట్టిన శ్రావ్యను పాటగా పెంచిన ఈ తల్లిదండ్రుల ప్రేమ, ప్రయాసలే ఈవారం ‘లాలిపాఠం’.

 
‘మీ అమ్మాయి ఇంత శ్రావ్యంగా పాడుతుందని ఊహించే ఆ పేరు పెట్టారా’ అని సుజాత, సుదర్శన్‌లను అడిగినప్పుడు... ‘‘శ్రావ్య మూడేళ్ల వయసులో హమ్ చేస్తూ ఉండేది. తనకు పాట వస్తే బావుణ్ననే ఆశ నాలో అప్పుడే కలిగింది. ఎందుకంటే పాప విజువల్లీ చాలెంజ్‌డ్ కిడ్ అని తెలిసిన తర్వాత మేము పడిన మానసిక సంఘర్షణ ఒకెత్తయితే, తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏం చేయగలం అనే పెద్ద ప్రశ్నార్థకం మా ముందు ఉండేది అప్పట్లో. ఏం చేస్తే తనకంటూ మంచి జీవితాన్ని ఇవ్వవచ్చో తెలియక పదహారేళ్లుగా నలిగిపోతూనే ఉన్నాం. పాపను పెంచడంలో ఎదురైన చేదు అనుభవాలు ఎలాగైనా సరే తనని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలనే కసిని నాలో పెంచాయి’’ అని సుజాత తన జీవనపోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
 
 ఒకప్పటి శ్రావ్య కాదు!
 
 ‘‘ఇప్పుడు మీరు చూస్తున్న శ్రావ్య ఒకప్పటి శ్రావ్య కాదు. దాదాపుగా సెవెన్త్, ఎయిత్ క్లాసుల వరకు తను చాలా ఇంట్రావర్ట్. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు... ఈ ఆరుగురు తప్ప మరో వ్యక్తి ఉంటే నోరు తెరిచేది కాదు. రాయిలా బిగుసుకుపోయేది. స్టేజి మీద పాడేటప్పుడు కూడా వణికిపోయేది. సైకాలజిస్ట్ జాన్ హేమంత్‌కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చి విపశ్శన ధ్యానసాధన చేయించారు. అది మొదలు తనలో వచ్చిన మార్పుకు మేమే ఆశ్చర్యపోయాం’’ అంటారు సుదర్శన్. ‘‘మరొకరి మీద ఆధారపడడాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది- అని చెప్తుండేవాడిని. అలాగే తను ప్రతిదీ సొంతంగా నేర్చుకుంటోంది.’’ అంటూ మురిసిపోయారు.
 
 అన్నికష్టాలనూ ఎదుర్కొన్నాం!
 
 ‘‘చాలెంజ్‌డ్ కిడ్‌ని పెంచడంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలనూ , సవాళ్లనూ ఎదుర్కొన్నాం. వెజాగ్‌లో చాలా స్కూళ్లు శ్రావ్యను చేర్చుకోవడానికి నిరాకరించాయి. చివరికి ‘చిప్ అండ్ డేల్’ స్కూలు వాళ్లు చేర్చుకున్నారు. అయితే సమాజం నుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతుండేవి. ముందుగా తనని కలుపుకునే వాతావరణంలోకి మారాలని హైదరాబాద్‌కు వచ్చాం. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా రోజుకో రకమైన పరీక్షలు ఎదురయ్యాయి. మా వారికి ఉద్యోగం వెతుక్కోవడం పెద్ద సమస్య అయింది.  చివరికి మా వారికి బెంగళూరులో ఉద్యోగం వచ్చిన తర్వాత రొటీన్ ఖర్చుల భయం తప్పిపోయింది. కానీ అప్పటికీ శ్రావ్యకు మంచి ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలంటే ఈ డబ్బు చాలదనే ఆందోళన ఉండేది’’ అన్నారామె ఉద్విగ్నంగా.
 
 తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం!
 
 ఆర్థికంగా స్థిరపడడమే అనేక సమస్యలకు సమాధానం అయిందంటారు సుదర్శన్. ‘‘ఆ పరిస్థితుల్లో మరో మార్గం లేదు. కేవలం డబ్బు సంపాదించడానికే కుటుంబాన్ని వదిలి ఫారిన్ వెళ్లాను. ఇప్పుడు మీరు చూస్తున్న శ్రావ్యను తయారుచేయడానికి మేమిద్దరం మా బాధ్యతలను రెండు రకాలుగా పంచుకున్నాం. హోమ్‌ట్యూషన్లకు మాత్రమే కాదు, ప్రతిచోటా సాధారణంకంటే ఎక్కువ ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేయలేకపోతే తననిలా తయారు చేయడం సాధ్యం కాదు. నేను డబ్బు సంపాదనలో ఉంటే సుజాతహైదరాబాద్‌లో పాపను చదివించుకుంటూ, సంగీతం నేర్పిస్తూ ఉండేది. అన్నింటికంటే ఎక్కువగా శ్రావ్యను వ్యక్తిత్వపరంగా తీర్చిదిద్దడానికి చాలా కష్టపడింది’’ అన్నారు.
 
 నన్ను నేను అప్‌డేట్ చేసుకున్నాను!
 
 ‘‘శ్రావ్యను చిన్న క్లాసుల్లో బ్రెయిలీలో చదివించాం. సిలబస్ పెరిగిన తర్వాత నేను టెక్ట్స్ బుక్ మొత్తం చదివి రికార్డు చేసేదాన్ని. శ్రావ్యకు ఎయిత్‌క్లాస్ నుంచి ల్యాప్‌టాప్ వాడడం నేర్పించాం. మా వారు బుక్‌ని వాయిస్ రికార్డు వెర్షన్‌లో స్కాన్ చేసేవారు. వాటిని విని పాఠాలు నేర్చుకునేది. కానీ ఇంతకంటే పెద్ద కష్టం చిన్నప్పటిదే. వైజాగ్ నుంచి నెలకోసారి హైదరాబాద్‌కొచ్చి ఎల్‌విప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసులకు హాజరయేదాన్ని. విజువల్లీ చాలెంజ్‌డ్ పిల్లలకు ఏ విషయాన్ని ఎలా నేర్పించాలనే విషయంలో శిక్షణ ఇచ్చేవాళ్లు. నేను నేర్చుకుని దానిని శ్రావ్యని పెంచడంలో అమలు చేయాలి. నేను కరెక్ట్‌గా నేర్చుకోకపోతే పాపకు సరిగ్గా నేర్పించలేననే భయంతో ప్రతిరోజూ నన్ను నేను అప్‌డేట్ చేసుకోవడంతోనే సరిపోయేది. ఇప్పుడు  గుర్తుచేసుకోబోతే నా జీవితంలో ప్రశాంతంగా సాగిన ఘట్టం ఇదీ అని ఒక్కటి కూడా గుర్తుకురావడం లేదు. శ్రావ్య కోసం పెట్టిన పరుగులే గుర్తుకొస్తున్నాయి’’ అన్నారు సుజాత.
 
 తనకు తానుగా నడవాలని...
 ‘పాటల పోటీల్లో చాలామంది పిల్లలు శ్రావ్యతో పోటీపడి గెలవడమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు... అంటే శ్రావ్యను పెంచడంలో, తనను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడంలో మేము సక్సెస్ అవుతున్నామనే సంతోషం కలుగుతోంది’- అంటున్నారు సుదర్శన్. ‘‘శ్రావ్యలో లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. నాసర్ స్కూల్‌లో లెవెన్త్, ట్వెల్త్ క్లాసులు చదువుతున్నప్పుడు ప్రిఫెక్ట్‌గా, కల్చరల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. కాలేజ్‌లో ఫ్రెండ్స్‌ని ‘నా చేతిని ఎవరూ పట్టుకోవద్దు. నాకు నేనుగా నడుస్తాను, కరెక్ట్‌గా వెళ్తున్నానా లేదా అనేది మాత్రం చూసి చెప్పండి’ అని అడుగుతుందట. వీటికి కారణం తన మీద తనకు ఏర్పడిన నమ్మకమే. ఆ నమ్మకం కలిగించడంలో మేము విజయవంతం కావడానికి ఇన్నేళ్లు పట్టింది’’ అన్నారాయన.
 
 ‘‘శ్రావ్య పెళ్లి గురించి ఇంట్లో సరదాగా మాట్లాడుతుంటాం. కానీ ఎంబిఏ పూర్తయిన తర్వాతే ఆలోచిస్తాం అన్నారు సుజాత. భవిష్యత్తులో తనకు తోడుగా మేము ఉన్నా లేకపోయినా తనకు తాను స్థిరంగా జీవించగలగాలి. అందుకే చదువునీ, సంగీతాన్ని బాలెన్స్ చేస్తూ పెంచుతున్నాం. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని కలిగిస్తున్నాం’’ అన్నారామె. శ్రావ్యను గాయనిగా, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ఈ దంపతులు పడిన శ్రమకు గౌరవ వందనం చేయాలనిపిస్తుంది.
 
 - వాకా మంజులారెడ్డి,
 సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 
 శ్రావ్య గురించి...

 చదువు
 వైజాగ్‌లోని చిప్ అండ్ డేల్ స్కూల్
 
 హైదరాబాద్‌లోని మారిక ఇంటర్నేషనల్ స్కూల్, నాసర్ స్కూల్.
 
 సెయింట్ ఫ్రాన్సిస్‌లో బికామ్, సిఏ చేస్తున్నారు.


 ప్రత్యేకతలు
 ముంబయి యూనివర్శిటీ నుంచి కర్నాటక సంగీతంలో సర్టిఫికేట్ కోర్సు చేశారు  తెలుగు యూనివర్శిటీ నుంచి కర్నాటక సంగీతం డిప్లమో కోర్సు చేస్తున్నారు.  


 ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి కపిల్‌సిబల్ చేతుల మీదుగా ‘జూనియర్ ఎక్స్‌లెన్స్ 2013’ పురస్కారం అందుకున్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement