'మా నాన్నను కలవండి'
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'కెప్టెన్' విజయకాంత్ పై తిరుగేబావుటా ఎగురవేసి సొంత కుంపటి పెట్టుకున్న డీఎండీకే ఎమ్మెల్యేలకు డీఎంకే తలుపులు తెరిచింది. డీఎండీకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఇప్పటికే తమ నాయకులు ఆహ్వానించారని డీఎంకే కోశాధికారి, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తమ పార్టీలో చేరాలనుకునే వారు డీఎంకే చీఫ్ కరుణానిధిని కలవాలని సూచించారు. విజయకాంత్ ను వ్యతిరేకించి 'మక్కల్ డీఎండీకే' పేరుతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ నాయకత్వంలో కొత్త పార్టీ పెట్టారు.
అటు తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) లోనూ తిరుగుబాటు దారులు సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమిలో తమిళ మానిల కాంగ్రెస్ చేరడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయం విజయకాంత్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.