Tamil Nadu Assembly Election 2016
-
విజయ్ కాంత్ కు డిపాజిట్ గల్లంతు
కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో జట్టుకట్టిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన డీఎండీకే అధినేత తన సీటు కూడా కాపాడులేకపోరు. అన్నాడీఎంకే చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయ్యారు. 2006 ఎన్నికల్లో డీఎండీకే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 10 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2011లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లు గెల్చుకున్నారు. జయలలితతో విభేదాలు కారణంగా అన్నాడీఎంకే గుడ్ బై చెప్పారు. తాజా ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. తానే సీఎం కావాలన్న మొండి పట్టుదలతో కరుణానిధితో పొత్తు పెట్టుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన పీబ్ల్యూఎఫ్ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకరించడంతో ఆ కూటమిలో చేరారు. అయితే ఈ సంకీర్ణంలోని ఒక్క పార్టీ కూడా ఖాతా తెరవకపోవడం విశేషం. కట్టుమన్నార్ కోయల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వీసీకే చీఫ్ తిరుమావలన్ ఒక్కరే విజయానికి దగ్గరగా వచ్చారు. కేవలం 87 ఓట్లతో ఆయన ఓడిపోయారు. మిగతా అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డీఎంకేతో విజయకాంత్ పొత్తు పెట్టుకుని వుంటే ఫలితాలు వేరేగా ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకే అధికారంలోకి రాకుండా సైంధవుడిలా ఆయన అడ్డుపడ్డారని కరుణానిధి మద్దతుదారులు మండిపడుతున్నారు. -
జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు. తెలుగు భాషతో పాటు తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు. -
'మా నాన్నను కలవండి'
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'కెప్టెన్' విజయకాంత్ పై తిరుగేబావుటా ఎగురవేసి సొంత కుంపటి పెట్టుకున్న డీఎండీకే ఎమ్మెల్యేలకు డీఎంకే తలుపులు తెరిచింది. డీఎండీకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఇప్పటికే తమ నాయకులు ఆహ్వానించారని డీఎంకే కోశాధికారి, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తమ పార్టీలో చేరాలనుకునే వారు డీఎంకే చీఫ్ కరుణానిధిని కలవాలని సూచించారు. విజయకాంత్ ను వ్యతిరేకించి 'మక్కల్ డీఎండీకే' పేరుతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ నాయకత్వంలో కొత్త పార్టీ పెట్టారు. అటు తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) లోనూ తిరుగుబాటు దారులు సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమిలో తమిళ మానిల కాంగ్రెస్ చేరడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయం విజయకాంత్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
విజయకాంత్ కు షాక్
చెన్నై: 'కెప్టెన్' విజయకాంత్ కు షాక్ తగిలింది. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీ విచ్ఛిన్నానికి దారి తీసింది. డీఎండీకే రెండుగా చీలిపోయింది. తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్.. డీఎండీకే నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. పీడీఎండీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నై టీ నగర్ లోని త్యాగరాజ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అసంతృప్త నాయకులతో చంద్రకుమార్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడంపై తిరుగుబాటు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విజయకాంత్ తో కొనసాగరాదని వారందరూ నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపారు. చంద్రకుమార్ నాయకత్వంలో పీడీఎండీకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎండీకే రెండు పార్టీలుగా చీలిపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. ఇంకా ఎన్ని సిత్రాలు జరుగుతాయోనని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
నేనే కింగ్
ఇక ఒంటరి సమరమే ప్రకటించిన కెప్టెన్ ప్రత్యామ్నాయం డీఎండీకే రెండో మేనిఫెస్టో విడుదల డీఎంకే, బీజేపీలకు షాక్ ‘కింగ్ మేకర్‌గా కాదు...కింగ్‌గా ఉండాలనుకుంటున్నా...ఇక ఎన్నికల్లో ఒంటరి సమరమే...’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం డీఎండీకే మాత్రమేనని స్పష్టం చేశారు. పొత్తు సస్పెన్షన్‌కు తెర దించుతూ విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. చెన్నై : పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు కలుపుకునే దిశగా డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సమయంలో రెండు రోజుల క్రితం విజయకాంత్ మా వెంటే అని డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం, అదే సమయంలో విజయకాంత్ సీఎం అభ్యర్థిగా కూటమి అని బీజేపీ ప్రకటించడం వంటి పరిణామాలతో డీఎండీకే కేడర్‌లో గందరగోళం బయలు దేరింది. ఇక నాన్చుడు ధోరణిని పక్కన పెట్టిన విజయకాంత్ తన మదిలో మాటను బయట పెట్టేందుకు నిర్ణయించారు. ఇందు కోసం వైఎంసీఏ మైదానంలో పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో మహిళా దినోత్సవ మహానాడుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ మహానాడుకు ప్రాధాన్యం సంతరించుకోవడంతో అందరి చూపు వైఎంసీఏ మీద పడింది. ఇందులో ప్రేమలత విజయకాంత్ ప్రసంగించే క్రమంలో తొలుత అన్నాడీఎంకే సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రమంగా డీఎంకే టార్గెట్ చేసి వ్యాఖల్ని సంధించడంతో ఇక, ఆ పార్టీతో పొత్తు డౌటే అన్నది స్పష్టమైంది. అదే సమయంలో ప్రజాకూటమి, బీజేపీలను లెక్కలోకి తీసుకోకుండా ఆమె ప్రసంగం సాగడంతో డీఎండీకే పయనం ఎటో అన్న ప్రశ్న సర్వత్రా బయలుదేరింది. అయితే, ఆది నుంచి డీఎంకేను ప్రేమలత విమర్శిస్తూ వస్తున్న దృష్ట్యా, ఇక విజయకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ బయలు దేరింది. ఇక ఆలస్యంగా విజయకాంత్ వేదిక మీదకు వచ్చిన రాగానే, పార్టీ నేతృత్వంలో సిద్ధం చేసిన యాప్‌ను విడుదల చేశారు. తదుపరి రెండో మేనిఫెస్టో అంటూ, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలు, పథకాలను వివరించే వీడియో చిత్రాన్ని విడుదల చేశారు. తదుపరి యథాప్రకారం తన దైన శైలిలో ప్రసంగాన్ని మొదలెట్టగానే, పొత్తు ప్రక టన చేస్తారా..? మళ్లీ నాన్చుడు ధోరణి అనుసరిస్తారా..? అన్న ఉత్కంఠ బయలు దేరింది. పొత్తు ప్రకటిస్తానంటూ, చివరకు విజయకాంత్ కింగ్ మేకర్‌గా కాదు...కింగ్ గా ఉండాలన్నదే కార్యకర్తల అభిమతంగా ప్రకటించారు. తానేదో భేరసారాల్లో ఉన్నట్టుగా తెగ కథనాలు వచ్చాయని, తానెవ్వరితోనూ ఎలాంటి భేరాలు సాగించ లేదని వ్యాఖ్యానించారు. చివరల్లో పొత్తు ప్రకటన చేస్తానని, అంత వరకు వేచి ఉండాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, తాను కింగ్...ఒంటరిగానే ఎదుర్కొంటా....ఇక, తన ఎన్నికల పయనం ఒంటరి సమరమే.. అని స్పష్టం చేయడం విశేషం. ఒంటరి సమరమే అంటూ విజయకాంత్ ప్రకటన చేయడంతో అక్కడున్న డీఎండీకే వర్గాలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. తదుపరి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఉందని, ఇందు కోసం ఓ కమిటీని ప్రకటిస్తూ, ఇక, ఒంటరిగా సమరాన్ని ఎదుర్కొనే కార్యచరణ మీదే దృష్టి... అంటూ ముగించడం విశేషం. కాగా, మహిళా సంక్షేమం, ప్రగతిని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని, ప్రభుత్వ నేతృత్వంలో సినీ మాల్స్ నిర్మాణాలు, మహిళలకు అప్పగింత, పేద మహిళలకు ఆలయాల్లో ఉచిత వివాహాలు, అన్ని రకాల లాంఛనాలు, వివిధ రంగాల్లో శిక్షణలు, రాయితీలతో మహిళలకు రుణాలు, తదితర కొత్తప్రకటనలు మేనిఫెస్టో ద్వారా చేయడం విశేషం. ఇక, పొత్తు వ్యవహారాన్ని విజయకాంత్ తేల్చడంతో షాక్‌కు గురై తదుపరి కార్యచరణ మీద డీఎంకే, బిజేపీ, ప్రజా కూటమిలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి.