విజయ్ కాంత్ కు డిపాజిట్ గల్లంతు
కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో జట్టుకట్టిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన డీఎండీకే అధినేత తన సీటు కూడా కాపాడులేకపోరు. అన్నాడీఎంకే చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయ్యారు.
2006 ఎన్నికల్లో డీఎండీకే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 10 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2011లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లు గెల్చుకున్నారు. జయలలితతో విభేదాలు కారణంగా అన్నాడీఎంకే గుడ్ బై చెప్పారు. తాజా ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. తానే సీఎం కావాలన్న మొండి పట్టుదలతో కరుణానిధితో పొత్తు పెట్టుకునేందుకు ఆయన ఒప్పుకోలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన పీబ్ల్యూఎఫ్ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకరించడంతో ఆ కూటమిలో చేరారు. అయితే ఈ సంకీర్ణంలోని ఒక్క పార్టీ కూడా ఖాతా తెరవకపోవడం విశేషం.
కట్టుమన్నార్ కోయల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వీసీకే చీఫ్ తిరుమావలన్ ఒక్కరే విజయానికి దగ్గరగా వచ్చారు. కేవలం 87 ఓట్లతో ఆయన ఓడిపోయారు. మిగతా అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డీఎంకేతో విజయకాంత్ పొత్తు పెట్టుకుని వుంటే ఫలితాలు వేరేగా ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకే అధికారంలోకి రాకుండా సైంధవుడిలా ఆయన అడ్డుపడ్డారని కరుణానిధి మద్దతుదారులు మండిపడుతున్నారు.