నేనే కింగ్
ఇక ఒంటరి సమరమే
ప్రకటించిన కెప్టెన్
ప్రత్యామ్నాయం డీఎండీకే
రెండో మేనిఫెస్టో విడుదల
డీఎంకే, బీజేపీలకు షాక్
‘కింగ్ మేకర్‌గా కాదు...కింగ్‌గా ఉండాలనుకుంటున్నా...ఇక ఎన్నికల్లో ఒంటరి సమరమే...’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం డీఎండీకే మాత్రమేనని స్పష్టం చేశారు. పొత్తు సస్పెన్షన్‌కు తెర దించుతూ విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది.
చెన్నై : పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు కలుపుకునే దిశగా డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సమయంలో రెండు రోజుల క్రితం విజయకాంత్ మా వెంటే అని డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం, అదే సమయంలో విజయకాంత్ సీఎం అభ్యర్థిగా కూటమి అని బీజేపీ ప్రకటించడం వంటి పరిణామాలతో డీఎండీకే కేడర్‌లో గందరగోళం బయలు దేరింది.
ఇక నాన్చుడు ధోరణిని పక్కన పెట్టిన విజయకాంత్ తన మదిలో మాటను బయట పెట్టేందుకు నిర్ణయించారు. ఇందు కోసం వైఎంసీఏ మైదానంలో పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో మహిళా దినోత్సవ మహానాడుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ మహానాడుకు ప్రాధాన్యం సంతరించుకోవడంతో అందరి చూపు వైఎంసీఏ మీద పడింది. ఇందులో ప్రేమలత విజయకాంత్ ప్రసంగించే క్రమంలో తొలుత అన్నాడీఎంకే సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రమంగా డీఎంకే టార్గెట్ చేసి వ్యాఖల్ని సంధించడంతో ఇక, ఆ పార్టీతో పొత్తు డౌటే అన్నది స్పష్టమైంది.
అదే సమయంలో ప్రజాకూటమి, బీజేపీలను లెక్కలోకి తీసుకోకుండా ఆమె ప్రసంగం సాగడంతో డీఎండీకే పయనం ఎటో అన్న ప్రశ్న సర్వత్రా బయలుదేరింది. అయితే, ఆది నుంచి డీఎంకేను ప్రేమలత విమర్శిస్తూ వస్తున్న దృష్ట్యా, ఇక విజయకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ బయలు దేరింది. ఇక ఆలస్యంగా విజయకాంత్ వేదిక మీదకు వచ్చిన రాగానే, పార్టీ నేతృత్వంలో సిద్ధం చేసిన యాప్‌ను విడుదల చేశారు.
తదుపరి రెండో మేనిఫెస్టో అంటూ, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలు, పథకాలను వివరించే వీడియో చిత్రాన్ని విడుదల చేశారు. తదుపరి యథాప్రకారం తన దైన శైలిలో ప్రసంగాన్ని మొదలెట్టగానే, పొత్తు ప్రక టన చేస్తారా..? మళ్లీ నాన్చుడు ధోరణి అనుసరిస్తారా..? అన్న ఉత్కంఠ బయలు దేరింది.
పొత్తు ప్రకటిస్తానంటూ, చివరకు విజయకాంత్ కింగ్ మేకర్‌గా కాదు...కింగ్ గా ఉండాలన్నదే కార్యకర్తల అభిమతంగా ప్రకటించారు. తానేదో భేరసారాల్లో ఉన్నట్టుగా తెగ కథనాలు వచ్చాయని, తానెవ్వరితోనూ ఎలాంటి భేరాలు సాగించ లేదని వ్యాఖ్యానించారు.
చివరల్లో పొత్తు ప్రకటన చేస్తానని, అంత వరకు వేచి ఉండాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, తాను కింగ్...ఒంటరిగానే ఎదుర్కొంటా....ఇక, తన ఎన్నికల పయనం ఒంటరి సమరమే.. అని స్పష్టం చేయడం విశేషం. ఒంటరి సమరమే అంటూ విజయకాంత్ ప్రకటన చేయడంతో అక్కడున్న డీఎండీకే వర్గాలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. తదుపరి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఉందని, ఇందు కోసం ఓ కమిటీని ప్రకటిస్తూ, ఇక, ఒంటరిగా సమరాన్ని ఎదుర్కొనే కార్యచరణ మీదే దృష్టి... అంటూ ముగించడం విశేషం.
కాగా, మహిళా సంక్షేమం, ప్రగతిని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని, ప్రభుత్వ నేతృత్వంలో సినీ మాల్స్ నిర్మాణాలు, మహిళలకు అప్పగింత, పేద మహిళలకు ఆలయాల్లో ఉచిత వివాహాలు, అన్ని రకాల లాంఛనాలు, వివిధ రంగాల్లో శిక్షణలు, రాయితీలతో మహిళలకు రుణాలు, తదితర కొత్తప్రకటనలు మేనిఫెస్టో ద్వారా చేయడం విశేషం. ఇక, పొత్తు వ్యవహారాన్ని విజయకాంత్ తేల్చడంతో షాక్‌కు గురై తదుపరి కార్యచరణ మీద డీఎంకే, బిజేపీ, ప్రజా కూటమిలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి.