నిజంగా మీరు జయలలితను అభిమానిస్తే...
చెన్నై: అన్నాడీఎంకే మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. మీరు నిజంగా జయలలితను అభిమానిస్తే సహనాన్ని పాటించాలన్నారు. మంగళవారం జయలలిత తరపున దాఖలైన పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ అభిమానులకు, అన్నాడీఎంకే మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు.
ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నారనే దాఖలైన కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ లభించిందంటూ పుకార్లు రావడంతో పలు మీడియా, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వార్తల్ని ప్రసారం చేశాయి. ఆతర్వాత బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందనే వార్త బయటకు పొక్కడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో అభిమానులు,కార్యకర్తలు అవేశానికి లోనవ్వద్దని పన్నీర్ సెల్వం సూచించారు.