నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ఓ ఐఐటీ విద్యార్థి !
న్యూ ఢిల్లీ: ఉద్యోగం కోసం బయోడేటా, అర్హత పత్రాలతో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. ఆ వెబ్సైట్లోనే తాను అమ్మకానికి ఉన్నానంటూ తన ప్రొఫైల్ ఉంచాడు. అందులోనే తన రెజ్యూమ్ మొత్తాన్ని కూడా అప్‌లోడ్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదువుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయితే అది అందరిలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నాడో ఏమో.. వెబ్సైట్లో తాను అమ్మకానికి ఉన్నానంటూ పూర్తి వివరాలు అందించాడు. తనకు రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. రూ. 27,60,200 గా తన ధరను నిర్ణయించుకున్న మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్ను కూడా ప్రకటించాడు. దేశంలోని మేధావులతో పోటీ పడినప్పుడు.. మిగతావారితో పోల్చితే మనం ఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు. మరి ఎంతో వినూత్నంగా అలోచించిన మిట్టల్కు ఫ్లిప్కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు.