
గుజరాత్‌లో దళితుల భారీ ర్యాలీ
అహ్మదాబాద్: పశు కళేబరాల తొలగింపును ఆపేయాలని గుజరాత్ దళిత సంఘాలు నిర్ణయించాయి. ఉనాలో ఆవు చర్మం ఒలుస్తున్న దళితులపై గోసంరక్షకుల దాడి నేపథ్యంలో ఆదివారం అహ్మదాబాద్‌లో ఈ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. తమపై దాడులు ఆగేంతవరకు కళేబరాలను తొలగించొద్దని, పారిశుద్ధ్య పనులూ ఆపేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకు భూములు కేటాయిస్తే.. వ్యవసాయం చేసుకుని గౌరవప్రదంగా బతుకుతామన్నారు. దాడులకు నిరసనగా అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు ఈ నెల 5న పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు.
ఉనాలో దాడులకు పాల్పడ్డ వారిని పాసా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు ఆగకపోతే 2017 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాగా, ఉనా ఘటనకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసిన హీరాభాయ్ సోలంకి(25) అనే యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందతూ ఆదివారం మృతిచెందారు. ఉత్సవాలు వాయిదా.. దేవాలయ కార్యక్రమాల నిర్వహణ విషయంలో దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య చర్చలు విఫలమవ్వటంతో తమిళనాడులోని నాగపట్టిణం అమ్మవారి ఉత్సవాలు రద్దయ్యాయి.
గుళ్లో జరిగే పూజల్లో తమకు అవకాశ మివ్వకపోతే ఇస్లాం స్వీకరిస్తామని దళితులు హెచ్చరించారు. జిల్లా అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఉత్సవాలు మినహా ఎప్పుడు దళితులు పూజ చేసినా తమకు అభ్యంతరం లేదని అగ్రవర్ణాల నేతలు ఒప్పుకున్నారు. దళితులు మాత్రం ఉత్సవాల్లోనే తమకు అవకాశం ఇవ్వాలన్నారు.