24 గంటల్లోనే ఇద్దరు పాత్రికేయులు..
పట్నా: పొరుగు రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్‌లలో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు జర్నలిస్టులు దారుణ హత్యకు గురయ్యారు. సీనియర్ పాత్రికేయుడైన రాజ్‌దేవ్ రంజన్‌ను శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. రాజ్‌దేవ్ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్'లో బ్యూరో చీఫ్ గా 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సివాన్ రైల్వేస్టేషన్ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ హత్యపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. 'బిహార్ జంగల్ రాజ్ నుంచి మహా జంగల్ రాజ్'గా మారిందని బీజేపీ మండిపడింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు జార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. లోకల్ న్యూస్ చానెల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల అఖిలేశ్ గురువారం రాత్రి అతి దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటనపై స్పందించిన జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ఈ కేసులో నిందితులను అరెస్టుచేసి.. దర్యాప్తు వేగవంతం చేయాలని డీజీపీని ఆదేశించారు.