
'అమ్మ' లేదంటూ.. 16 మంది మృతి
అమ్మ ఇక్కడ లేనిదే ఈ జీవితం మాకొద్దు.. అమ్మకు ఇంత అన్యాయమా.. మేం తట్టుకోలేం అంటూ అనేకమంది అసువులు బాశారు. పురుచ్చితలైవి జయలలిత జైలు పాలయ్యారని తెలిసి, తట్టుకోలేక.. గుండె పగిలి తమిళనాడులో 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉరేసుకోగా, అన్నాడీఎంకే మద్దతుదారుడు ఒకరు ఒంటికి నిప్పంటించుకున్నాడు. మరో అభిమాని వేగంగా వస్తున్న బస్సు ముందు దూకి మరణించాడు. ఇంకొకరు విషం తాగారు. వీళ్లు కాక ఇంకో పదిమంది జయలలిత గురించి టీవీలలో కథనాలు రాగానే గుండెపోటుతో మరణించారు.
ఇంటర్ విద్యార్థి సహా ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి చేసుకోడానికి ప్రయత్నించారు. వారు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి అయితే తిరుపూరులో తన చిటికెన వేలును కోసేసుకున్నాడు.
జయలలితకు ఉన్న ప్రజాదరణ కారణంగానే ఇలా జరుగుతోందని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, ఎవరూ ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జయలలితను తమ అమ్మగానే భావిస్తారని అన్నాడీఎంకే మహిళా విభాగం ఉప కార్యదర్శి సీఆర్ సరస్వతి చెప్పారు.
తమిళనాడులో సినీనటులు, రాజకీయ నాయకులను విపరీతంగా ఆరాధిస్తారని, ఇలాంటి రాష్ట్రంలో వాళ్లకు ఏమైనా అయ్యిందని తెలిస్తే గుండె పగలడం, ఆత్మహత్యలు చేసుకోవడం సాధారణమేనని ఓ విశ్లేషకుడు అన్నారు.