న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇండియాలో కరోనా మహమ్మారి సృష్టించిన మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు.. కేవలం 24 గంటల్లో 194 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. కొత్తగా 6,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాలు 4,531కు, పాజిటివ్ కేసులు 1,58,333కు ఎగబాకాయి. దేశంలో మొత్తం క్రియాశీల కరోనా కేసులు 86,110 కాగా, 67,691 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అంటే 42.75 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా సంభవించిన 194 మరణాల్లో మహారాష్ట్రలోనే 105 మరణాలు వెలుగుచూశాయి. గుజరాత్‌లో 23, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 8 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో ఇప్పటిదాకా 1,897 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటికే 56,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 18,545, ఢిల్లీలో 15,257, గుజరాత్‌లో 15,195, రాజస్తాన్‌లో 7,703, మధ్యప్రదేశ్‌లో 7,261, ఉత్తరప్రదేశ్‌లో 6,991 కేసులు బయటపడ్డాయి. కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావిస్తున్న కేరళలో తాజాగా ఒక్కరోజే 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1,088కు చేరింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కేరళలో కరోనాతో మృతి చెందాడు. అతడు రాజస్తాన్ నుంచి మే 22న కేరళకు వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడని కేరళ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment