సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ముస్లింల బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జంతు బలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని సాగించాలని భారతీయ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్లూబీఐ) నిర్ణయించింది. జంతు బలిని నియత్రించేందుకు జంతువుల క్రూరత్వ నిరోధక చట్టాన్ని అమలు చేయాలని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించింది. జంతువులను బలివ్వడం మతపరమైన చర్య కాదని, ఏ మతం పేరిట కూడా జంతువులను బలివ్వడానికి వీల్లేదని బోర్డు చైర్మన్ ఎస్పీ గుప్తా వ్యాఖ్యానించారు. ఆయన్ని చట్టం గురించి తెలియని అజ్ఞాని అనుకోవాలా, ఓ మతాన్ని లక్ష్యం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్న మూర్ఖుడు అనుకోవాలా? అర్థం కావడం లేదు.
బక్రీద్ సందర్భంగా ముస్లింలు గొర్రెలను, మేకలను బలిస్తారనే విషయం తెల్సిందే. ఈ ఆచారం ఓ ముస్లింల మతానికే పరిమితం కాలేదు. హిందూ మతం పేరిట కూడా ఈ ఆచారం అమల్లో ఉంది. మైసమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ లాంటి గ్రామ దేవతల పేరుతోనే కాకుండా దేశంలోని పలు హిందూ దేవాలయాల్లో రోజుకు వేలాది జంతువులను బలిస్తుంటారు. అందుకనే జంతువుల క్రూరత్వ నిరోధక బిల్లులోని 28 సెక్షన్ ఇలాంటి జంతు బలులకు మినహాయింపు ఇచ్చింది. ‘ఓ సామాజిక వర్గం వారి మతాచారం ప్రకారం అవసరమైన జంతు బలి ఇవ్వడాన్ని నేరంగా పరిగణించాలని ఈ చట్టంలోని ఏ అంశం కూడా సూచించడం లేదు’ అని చట్టంలోని 28వ సెక్షన్ చెబుతోంది.
అంతేకాకుండా ఏ మతానికైనా ఆచారాలు ముఖ్యమని, రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద మత విశ్వాశాలకు స్వేచ్ఛ ఉన్నందున మతాచారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఏ కోర్టుకు లేదంటూ సుప్రీం కోర్టు పలుసార్లు తీర్పు చెప్పింది. ఈ లెక్కన మతాచార జంతు బలులకు సంబంధించి కోర్టులకెళ్లే అధికారం లేదా హక్కు జంతు సంక్షేమం బోర్డుకు లేదు. అయితే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం కింద దేశంలో జంతు బలులను క్రమబద్ధీకరించవచ్చు. లైసెన్స్‌లున్న కబేళాలలో మాత్రమే జంతువులను వధించాలనడంతోపాటు వధించేటప్పుడు జంతువులకు నొప్పి తెలియకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చట్టాల్లో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో జంతువులను బలివ్వరాదు. దీనర్థం కబేళాల్లోనే జంతువులను బలివ్వాలి. అలాగే దేవాలయాల వద్ద కూడా బలివ్వ వచ్చు.
దేశవ్యాప్తంగా 1700 కోట్ల కబేళాలు మాత్రమే ఉన్నాయని గతేడాది ప్రభుత్వమే లోక్‌సభకు తెలియజేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఇవేమాత్రం సరిపోవు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలిస్తుంటారు. జంతు బలులను క్రమబద్దీకరించాలనుకుంటే జంతు సంక్షేమ బోర్డు ముందుగా కబేళాల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దానికి బదులుగా జంతు బలులను నియంత్రిస్తామంటే ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడడమే అవుతోంది. మరో రెండు నెలల్లో అంటే, ఆగస్టు 21న బక్రీద్ వస్తుందనగా నిర్ణయం తీసుకోవడమంటే మరెట్లా అర్థం చేసుకోవాలి! బక్రీద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా, రోడ్లపైన, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఇవ్వరాదని ముస్లిం మత పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment