ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,850 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73, 165గా ఉంది. కాగా కరోనాతో ఒక్కరోజులో 613 మంది మరణించడంతో దేశంలో మరణాల సంఖ్య 19,268కి చేరుకుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4, 09,083గా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. (కరోనా రిస్క్ ఎంత?)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని త్వరితగతిన గుర్తించడం, సరైన సమయానికి వైద్య చికిత్సను అందించడం ద్వారా భారత్ రికవరీ రేటులో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. దేశంలో 24 గంటల్లోనే దాదాపు 25వేల కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తున్నా.. మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా అంతే స్థాయిలో ఉండడం ఊరటనిచ్చే అంశం. గత 24 గంటల్లో కరోనా నుంచి 14,857 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనా రికవరీ రేటు 60.92గా ఉంది.దేశంలో జూలై 4 వరకు 97,89,066 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 2,48,934 నమూనాలను పరీక్షించామని తెలిపింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు చూసుకుంటే.. అమెరికాలో 29, 12,166 కేసులు, బ్రెజిల్‌లో 15,50,176 కేసులు, రష్యాలో 6,74,515 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాకు భారత్ మరింత చేరువయ్యింది. ఇరు దేశాల మధ్య సుమారు వెయ్యి కేసుల వ్యత్యాసం మాత్రమే ఉన్నది.
Comments
Please login to add a commentAdd a comment