భువనేశ్వర్ : అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేధించేలా డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన కే 4 బాలిస్టిక్ క్షిపణిని విశాఖపట్నానికి 30 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో భారత్ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం రెండేళ్లుగా పలుమార్లు విఫలమైన క్రమంలో తాజా ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. ఉన్నతమైన కచ్చితత్వాన్ని సాధించడమే ఈ క్షిపణి లక్ష్యమని డీఆర్‌డీఓ వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ క్షిపణి ప్రయోగానికి సర్వం సిద్ధమైనా బంగాళాఖాతంలో బుల్‌బుల్ తుపాన్ ప్రభావంతో ప్రయోగం వాయిదా పడింది. అణు జలాంతర్గాముల్లో దీన్ని అమర్చే ముందు భారత్ ఈ క్షిపణిపై మరికొన్ని ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉంది. భారత్ తన జలాంతర్గాముల శ్రేణుల కోసం అభివృద్ధి చేస్తున్న రెండు అండర్‌వాటర్ క్షిపణుల్లో కే 4 క్షిపణి ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment