
న్యూఢిల్లీ: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం గల స్వదేశంలో తయారైన క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి మంగళవారం ఈ పరీక్ష జరిగింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో విఫలమైన నిర్భయ్ ఐదో ప్రయత్నంలో విజయవంతం కావడం గమనర్హం.
ఈ విజయంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ సాంకేతికత సాధించిన కొన్ని ప్రముఖ దేశాల సరసన భారత్ నిలిచిందని పేర్కొన్నారు. భూ ఉపరితలం నంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు.
ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది. నిర్భయ్ 647 కి.మీ దూరం ప్రయా ణించేందుకు 50 నిమిషాలు పట్టిందని డీఆర్‌డీఓ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తోమాహక్ క్షిపణులు, పాకిస్తాన్ బాబర్ ఎల్‌ఏసీఎంకు నిర్భయ్ ఓ దీటైన జవాబు అని భావిస్తున్నారు.