న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్ పీచమణచడానికి సంప్రదాయక యుద్ధం చేయడం అంత సులువు కాకపోతే జల యుద్ధం చేయాలని పలు వర్గాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తున్నాయి. జల యుద్ధం అంటే ఇరు దేశాల మధ్య పారుతున్న నదుల పరివాహక ప్రాంతాల్లో జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే.
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సింధు నదీ జలాల ఒప్పందంపై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఆ ఒప్పందాన్ని మనం ఏకపక్షంగా రద్దు చేసుకోవచ్చా? ఏకపక్షంగా చేసుకున్నా అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఫలితంగా ఇరు దేశాలు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రసిద్ధ సింధూతోపాటు జీలం, చీనాబ్, సట్లేజ్, బియాస్, రావి అనే ఉప నదులు పారుతున్నాయి. ఈ నదీ జలాల పంపకం కోసం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. పశ్చిమ ప్రాంతంలో ప్రవహిస్తున్న సింధూ, జీలమ్, చీనాబ్ నదుల జలాలను పాకిస్థాన్ ఎక్కువగా వాడుకుంటే, తూర్పున ప్రవహిస్తున్న సట్లేజ్, బియాస్, రవి నదుల జలాలను భారత్ ఎక్కువగా వినియోగించుకుంటోంది.
ఈ ఆరు నదులు భారత భూభాగం నుంచే పోతున్నందున పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ‘సింధూ ఒప్పందం’ రద్దు చేసుకొని పాకిస్థాన్‌కు నదీ జలాలు వెళ్లకుండా నియంత్రించాలన్నది పలు వర్గాల నుంచి భారత ప్రభుత్వానికి అందుతున్న సూచన. తద్వారా పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిని భారత్ దారికొస్తుందన్నది వారి వాదన. ఈ ఒప్పందం విషయంలో ఎప్పుడైనా వివాదం తలెత్తితే జోక్యం చేసుకునే అధికారం పరిమితంగానైనా ప్రపంచ బ్యాంకుకు ఉంది. సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ ‘మధ్యవర్తి’ని ప్రపంచ బ్యాంకు నియమించవచ్చు. దీన్ని పట్టించుకోకుండా కూడా భారత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.
అయితే ఈ ఆరు నదుల్లో నీటిని దిగువకు వదలకుండా నిల్వ చేసుకోవడానికి భారీ డ్యామ్‌లేవీ మన భూభాగంలో లేవు. వాటిని నిర్మించుకోవడానికి మనకు చాలాకాలమే పడుతుంది. ఒకవేళ నిర్మించినప్పటికీ నీటిని మనవైపు మళ్లించేందుకు ఆస్కారమే లేదు. ఇరుదేశాల సరిహద్దుల్లో వున్న భౌగోళిక పరిస్థితులే అందుకు కారణం. భారీ డ్యామ్‌లు నిర్మించుకున్నా కొంతకాలం మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయకుండా ఆపగలంగానీ, ఎక్కువ సేపు ఆపలేం. డ్యామ్‌లు నిండితే వదలకుండా ఏం చేయలేం. ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌లో పరిశోధన చేస్తున్న ఉత్తమ్ కుమార్ లాంటి వారు ఎంతో మంది అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి ఇదివరకే వివరించారు.
పాక్‌తో సింధూ జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే బంగ్లా, నేపాల్ దేశాలతో మనం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఆ దేశాలకు నీరివ్వలేం. వాటితో కూడా అంతర్జాతీయ వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేన్ని ఖాతరు చేయకుండా తాత్కాలికంగానైనా పాక్‌కు నదుల జలాలను నిలిపేయాలకుంటే చైనా తక్షణమే రంగప్రవేశం చేస్తుంది. సింధూ, సట్లేజ్ నదులు టిబెట్ నుంచి పారుతున్నందున టిబెట్ చైనా ఆధీనంలో ఉండడం వల్ల అక్కడ ఆ నదులకు అడ్డుకట్ట వేస్తోంది. ఇటీవలనే ఈ విషయాన్ని చైనా స్పష్టం చేసింది కూడా.
ఏ రకంగా చూసినా జల యుద్ధం అన్ని రకాలుగా భారత్‌కే నష్టం. అందుకనే భారత్, పాక్ మధ్య జరిగిన 1965, 1971, 1999 యుద్ధాలేవి ఈ జల వనరుల ఒప్పందంపై ప్రభావం చూపలేకపోయాయి.