బి.ఎస్.ధనోవా
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తలెత్తగల సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉందని వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు. అత్యవసర సమయాల్లో మిత్రదేశాలకు సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు ముందుంటుందని వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. ‘దేశానికి సరిహద్దుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌కు అపరిష్కృత సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల కారణంగా ప్రధాన ముప్పు ఎదురవుతోంది. సరిహద్దు అవతల నుంచి ఎదురయ్యే ఉగ్రముప్పును సైతం ఐఏఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదు.
పొరుగున ఉన్న దేశాలు(చైనా, పాక్) ఆయుధ వ్యవస్థల్ని శరవేగంగా ఆధునీకరించడం, మౌలిక వసతులను మెరుగుపర్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు దీటుగా మిగ్–29, జాగ్వార్, మిరేజ్–2000లను ఆధునీకరిస్తున్నాం. అలాగే 83 తేజస్, 36 రఫేల్ ఫైటర్‌జెట్లను కొనుగోలుచేస్తున్నాం’ అని తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ చురుకైన పాత్ర పోషించడంపై స్పందిస్తూ..‘ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్ పూర్తి అప్రమత్తంగా ఉంది. అత్యధిక సీ–17 గ్లోబల్ మాస్టర్ యుద్ధ విమానాలు వినియోగిస్తున్న జాబితాలో ఐఏఎఫ్ రెండోస్థానంలో ఉంది. వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల యుద్ధవిమానాలు కావాల్సి ఉండగా 32 స్క్వాడ్రన్లు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment