ఐదుగురు పాక్ సైనికుల హతం
- ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లకు గాయాలు
- ఎల్‌ఓసీలో భారత్ ప్రతీకార దాడులు
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంట జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు హతమైనట్లు భారత ఆర్మీ ప్రకటించింది. భీంబర్, బట్టల్ సెక్టార్లలో పాక్ నుంచి ఆకస్మిక కాల్పులు మొదలవడంతో ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని గురువారం తెలిపింది. ఎదురు కాల్పుల్లో ఆరుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు తెలిసింది. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు దిగిందని సైన్యం పేర్కొంది.
ఎల్‌ఓసీ వెంట రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో భారత పోస్టులపై మోర్టార్ షెల్స్‌తో దాడికి పాల్పడిందని రక్షణ శాఖ అధికారి వెల్లడించారు. పాక్ కాల్పుల్లో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌కు చెందిన ఓ కార్మికుడు చనిపోగా, ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గురువారం జరిగిన మరో ఘటనలో... జమ్మూ కశ్మీర్ సోపోర్‌లోని నాతీపురాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. రాష్ట్రీయ రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు.
కశ్మీర్‌లోని కీలక ఉగ్రవాదుల జాబితా
కశ్మీర్ లోయలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న 12 మంది ఉగ్రవాదులతో కూడిన జాబితాను భారత ఆర్మీ ఇటీవల విడుదల చేసింది. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్‌ను భద్రతా దళాలు త్రాల్ ప్రాంతంలో శనివారంనాటి ఎన్‌కౌంటర్‌లో చంపడం తెలిసిందే. లష్కరే తోయిబాకు చెందిన అబు దుజాన, హిజ్బుల్‌కు చెందిన రియాజ్ నైకూ, హిజ్బుల్ నుంచి బయటకు వచ్చిన జకీర్ మూసా తదితరుల పేర్లు ఆర్మీ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. సబ్జార్ మృతి అనంతరం హిజ్బుల్ తదుపరి కమాండర్‌గా నైకూ నియమితుడైనట్లు సమాచారం. వీరితోపాటు అల్తాఫ్ దార్, బషీర్ వనీ, అబు హమస్, మహ్మద్ యాసిన్ ఇట్టూ, జునైద్ మటూ, సద్దాం పద్దర్, షౌకత్ తక్, వసీం, జీనత్ ఉల్ ఇస్లాంల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.