
సాక్షి, చండీగఢ్ : లడఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అరికట్టేందుకు భారత్ మరో వ్యూహాత్మక ప్రయోగానికి తెరతీస్తోంది. లడఖ్ నియంత్రణ రేఖనుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నాలు గతంలో అధికంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. ఆ ప్రాంతంలో ఒంటెలను గస్తీ కోసం ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిహద్దుల్లో పహారాతో పాటూ, సైనికులకు ఆయుధాలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఈ ఒంటెలను ఆర్మీ ఉపయోగించుకోవాలని యోచన చేస్తోంది.
ప్రయోగాత్మక దశలో రెండు మూపురాలున్న ఒంటెలను ఇందుకు వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయం తీసుకుంది. రెండు మూపురాలున్న ఒంటెలు అలవోకగా 180 నుంచి 200 కిలోల బరువును మోసుకెళ్లగలవు. అంతేకాక ఇవి రెండుగంటల వ్యవధిలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని అనాయాసంగా ప్రయాణించగలవు.
ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన జంతువులకన్నా.. రెండు మూపురాలున్న ఒంటెలు ఎడారిలో అత్యంత వేగంగా ప్రయాణించగలవు. ఇదిలావుండగా.. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా సైన్య శిక్షణ ఇస్తుందని తెలుస్తోంది. అంతేకాక సైన్యంలోని వివిధ అవసరాలకు ఒంటెలను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.