స్విస్‌ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి? | Indian deposits in swiss bank dips | Sakshi
Sakshi News home page

స్విస్‌ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?

Published Mon, Jul 3 2017 7:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

స్విస్‌ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?

స్విస్‌ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?

న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు వివిధ చర్యలు తీసుకోవడంతోపాటు విదేశాల్లో దాస్తున్న నల్లడబ్బును కూడా నియంత్రించేందుకు ఆయా దేశాలతో పాత చట్టాలను బలోపేతం చేసుకోవడం, కొత్త చట్టాలను తీసుకురావడం మంచి ఫలితాలనిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక జీఎస్టీ ప్రారంభోత్సవం రోజున (జూలై 1న) చెప్పారు. స్విస్‌ బ్యాంక్‌లో 2016 సంవత్సరానికి భారతీయుల డిపాజిట్లు అంతకుముందు సంవత్సరం కన్నా సగానికి సగం పడిపోవడమే అందుకు ఉదాహరణగా చూపారు. 2015 సంవత్సరంలో స్విస్‌ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 8,135 కోట్ల రూపాయలు ఉండగా, 2016, జూన్‌ నాటికి  4,482 కోట్ల రూపాయలకు పడిపోయాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే స్విస్‌ బ్యాంక్‌లో మన భారతీయుల డిపాజిట్లు తగ్గాయా? ఏ ఏడాది నుంచి డిపాజిట్లు తగ్గుతున్నాయి? దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమైనా ఉందా? తగ్గటానికి ఇతరత్రా కారణాలు ఇంకేవైనా ఉన్నాయా? స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించిన భారతీయ డిపాజిట్లు 2016 జూన్‌ నెల నాటివి. అదే సంవత్సరం నవంబర్‌ నెలలో పెద్ద నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసినందున వాటి ప్రభావం ఉండే అవకాశమే లేదు.

ఇక స్విట్జర్లాండ్‌ ఆటోమేటిక్‌గా ప్రతి ఏటా భారత ప్రభుత్వానికి స్విస్‌ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్ల వివరాలను అందుజేసేందుకు ఆ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వానికి 2016, నవంబర్‌ 22న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2018, సెప్టెంబర్‌ నెల నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. పైగా ఈ ఒప్పందంలో పెద్ద మెలిక ఉంది. 2018, సెప్టెంబర్‌ నెలకు ముందున్న బ్యాంకు డిపాజిట్‌ వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదు. 2018, సెప్టెంబర్‌ నెల నుంచి మాత్రమే, అది అప్పటికున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను అందజేస్తుంది. అంటే మొదటిసారిగా ఖాతా వివరాలు 2019, సెప్టెంబర్‌ నెలలో మాత్రమే భారత్‌కు అందుతాయి. డిపాజిట్‌దారుల పేర్లను ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయమన్న షరతుతోనే స్విస్‌ ఈ ఒప్పందానికి అంగీకరించింది. పైగా ఇలాంటి ఒప్పందం స్విట్జర్లాండ్‌తో ఒక్క భారత్‌ దేశమే కాదు. మొత్తం 40 దేశాలు చేసుకున్నాయి.


2016, జూన్‌ నాటికి స్విస్‌ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్లు 4,482 రూపాయలకు పడిపోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకు సంబంధం లేదు. మరి డిపాజిట్లు ఎందుకు పడిపోతున్నాయి. గతంలో 2012లో ఒక్కసారి పడిపోగా ఆ తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాల్లో వరుసగా భారతీయుల డిపాజిట్లు పడిపోతూ వస్తున్నాయి.

పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ సంస్థ ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ 2014లోనే స్విస్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంపై భారత్‌ సహా 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ 50 దేశాలకు చెందిన ఖాతాదారుల లావాదేవీల వివరాలను స్విస్‌ బ్యాంక్‌ ఆయా దేశాలకు అందజేయాల్సి ఉంటుందని ఆ సంస్థ హెడ్‌ మోనికా భాటియా తెలిపారు. ఆ ఒప్పందం ప్రభావం వల్లనే భారతీయుల డిపాజిట్లు సగానికి సగం తగ్గి ఉంటాయని ఆర్థిక నిపుణుల భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement