
రైలు ప్రయాణాన్ని మరింత సుఖవంతం, సురక్షితం చేయడం కోసం భారతీయ రైల్వే త్వరలో ‘స్మార్ట్ కోచ్’లను ప్రవేశపెట్టనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రాయబరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ స్మార్ట్ కోచ్‌లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన 100 స్మార్ట్ బోగీలను త్వరలోనే పట్టాలపైకి ఎక్కించనున్నారు. నమూనా బోగీనొకదాన్ని తయారు చేశారు కూడా. స్మార్ట్‌కోచ్ ప్రత్యేకతలేంటంటే...
నిఘా కెమెరాలు: ప్రతి బోగీలో 6 సీసీ కెమెరాలుంటాయి. అవి బోగీలో పరిస్థితిని అనుక్షణం రికార్డు చేస్తాయి. కంట్రోల్ సెంటర్‌లో ఈ రికార్డింగులను పరిశీలిస్తారు.
వాటర్ లెవల్ ఇండికేటర్: రైలు కంపార్ట్‌మెంట్లలో నీళ్లు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది దీని ద్వారా పరిశీలిస్తారు. సగానికంటే తక్కువ నీళ్లు ఉన్నట్టు తేలితే తర్వాత వచ్చే వాటరింగ్ స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. వచ్చే స్టేషన్‌లో నీళ్లు నింపుతారు.
డిజిటల్ డెస్టినేషన్ బోర్డు: రైలు వేగం, రాబోయే స్టేషను పేరు, అది ఎంత దూరంలో ఉంది. ఎప్పటిలోగా ఆ స్టేషన్‌ను చేరుకోవచ్చు, ఆలస్యం ఏమైనా ఉందా.. అన్న వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తారు. ముందుగా రికార్డు చేసిన ఈ సమాచారాన్ని జీపీఎస్ ద్వారా వెల్లడిస్తారు.
వైఫై: బోగీలో ఏర్పాటు చేసే వైఫై ద్వారా ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో సినిమాలు, వీడియోలు వీక్షించవచ్చు. పాటలు వినొచ్చు. వీడియో గేములు ఆడుకోవచ్చు. తమ ప్రయాణ అప్‌డేట్స్ కూడా తెల్సుకోవచ్చు.
రెండో తరం స్మార్ట్ కోచ్‌లలో బోగీలలో గాలి నాణ్యతను కొలిచే, స్వచ్ఛమైన గాలిని పంపే వ్యవస్థలు, ఫేస్ డిటెక్షన్, ఫైర్–స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లున్నాయి. టాయ్‌లెట్లలో ఎవరైనా ఉన్నారో లేదో తెల్సుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తేనున్నారు.
కోచ్ డయాగ్నస్టిక్ సిస్టమ్
రైలు చక్రాలు, బేరింగ్‌లు, పట్టాల పరి స్థితిని ఈ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సెన్సార్ మానిటర్‌లతో సేకరించే ఈ సమాచారాన్ని జీపీఎస్/జీపీఆర్‌ఎస్‌ల ద్వారా కేంద్రీయ సర్వర్‌కు పంపుతారు.అక్కడి నిపుణులు సమాచారాన్ని విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment