భువనేశ్వర్: ఆటిజమ్, ఫుడ్ అలర్జీలతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి రాజస్తాన్ నుంచి ఒంటె పాలు సరఫరా చేయడం ద్వారా రైల్వే శాఖ తన మానవతను చాటుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఫల్నా ప్రాంతం నుంచి ఒడిశాలోని బెహ్రంపూర్‌కు ఈ ఒంటెపాలు సరఫరా చేయడం విశేషం. పార్సిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ద్వారా ఢిల్లీ, హౌరా మీదుగా పాలు ఒడిశా చేరాయని, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో బాలుడి బంధువుకు పాలు అందజేశామని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 20 కిలోలున్న ప్యాకేజీ కోసం రూ.125 వసూలు చేశామని తెలిపింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమం సేతు ద్వారా దీనిని చేపట్టామని అధికారులు తెలిపారు.
ఆటిజమ్, ఫుడ్ అలర్జీలు ఉన్న బాలుడికి ఒంటెపాలు ఎంతో మేలు చేస్తాయని బాలుడి బంధువు చందన్ కుమార్ ఆచార్య తెలిపారు. సేతు కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అత్యవసరమైన మందులు, ఇతర పదార్థాల సరఫరా సాఫీగా జరిగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 100 ప్రాంతాల్లో అత్యవసరమైన పదార్థాలను సరఫరా చేశామని తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రంతోనూ తాము పనిచేశామని, మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు, వెంటిలేటర్లు, ఎరువులు, కొన్ని ముడిసరుకులను దేశవ్యాప్తంగా రవాణా చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment