భారత్ బిడ్డకు స్వాగతం: సుష్మా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వ్యక్తి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకున్నభారత మహిళ ఎట్టకేలకు భారత్‌కు తిరిగి వచ్చింది. ఈమె రాకపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో స్పందించింది. ‘భారత బిడ్డకు స్వాగతం.. మీరు ఎదుర్కొన్న పరిస్థితిలన్నింటికి నేను క్షమాపణ చెబుతున్నా’ అని ట్వీట్ చేసింది.
ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని పోలీసుశాఖను ఆదేశించింది. దీంతో నేడు( గురువారం) ఆమె క్షేమంగా భారత్ కు చేరింది.