
ఆధార్ కార్డుకు ట్రావెల్ డాక్యుమెంట్‌గా గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : నేపాల్, భూటాన్‌లు సందర్శించేందుకు ఇకపై 15 సంవత్సరాల లోపు, 65 ఏళ్లు పైబడిన భారతీయులు తమ ఆధార్ కార్డులను ట్రావెల్ డాక్యుమెంట్‌గా చూపవచ్చని హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఇతర వయో వర్గాల్లో ఉన్న భారతీయులు ఈ రెండు దేశాల్లో ఆధార్ కార్డును ఉపయోగించలేరని పేర్కొంది. పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్‌లో వీసాలు లేకుండా సరైన పాస్‌పోర్ట్‌తో భారతీయులు అడుగుపెట్టవచ్చు.
పాస్‌పోర్ట్‌తో పాటు ఎన్నికల కమిషన్ జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డు లేదా భారత ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులతో ఆయా దేశాల్లో భారతీయులు ప్రయాణించవచ్చు. గతంలో 65 ఏళ్లుపైబడిన వారు, 15 సంవత్సరాలలోపు వారు తమ గుర్తింపు కార్డుగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సీజీహెచ్‌ఎస్ కార్డు, రేషన్ కార్డులను చూపుతుండగా, తాజాగా ఆధార్ కార్డును ఈ జాబితాలో చేర్చారు.
భారత్, నేపాల్ మధ్య ప్రయాణించేందుకు ఖట్మండులో భారత రాయబార కార్యాలయం జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సరిపోదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సర్టిఫికెట్ నేపాల్ నుంచి భారత్‌కు తిరిగివచ్చే ఒక ప్రయాణానికే చెల్లుబాటవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు టీనేజర్లు భారత్, నేపాల్‌ల మధ్య ప్రయాణించేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చే నిర్ధేశిత రూపంలో జారీ చేసిన గుర్తింపు కార్డును కలిగిఉండాలని వెల్లడించాయి.