పెట్రోల్ పోసేముందు లిప్‌స్టిక్ పెట్టి జుట్టుకట్టింది
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. షీనాను ఇంద్రాణి ఎలా చంపేశారో పూసగుచ్చినట్లు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. షీనాను గొంతునులిమి చంపిన తర్వాత ఇంద్రాణి ఆమె ముఖంపై కూర్చుని 'ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడే ఉంది. ఇక జరిగిన విషయాలు ఎవరితో చెప్పకు.. చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంద్రాణి బెదిరించినట్లు వివరించాడు.
షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నాటి విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానం వివరించాడు. 'ఏప్రిల్ 24, 2012న షీనాబోరాను కారులో తీసుకెళ్లాం. దారిలో మెడిసిన్ కాక్ టెయిల్, ఆల్కహాల్ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది.
దీంతో ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేస్తుండగా నేను నోరు మూశాను. ఆ సమయంలో ఆమె నా బొటన వేలిని కొరికింది. కొద్ది సేపట్లోనే ఆమె ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహంతో వెళ్లే సమయంలోనే కారులో షీనా ముఖంపై కూర్చున్న ఇంద్రాణి 'ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్' అంటూ నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను గుర్తు చేసింది. అనంతరం అడవిలోకి వెళ్లాం. ఆ సమయంలో షీనా పెదాలకు లిప్‌స్టిక్ రాసి జుట్టుకట్టింది. ఆ తర్వాత పెట్రోల్‌పోయగా ఆమె నిప్పంటించింది. వెంటనే తిరిగొచ్చి దారిలో కాఫీ తాగాం. అప్పుడే ఈ విషయం మర్చిపోవాలని నాకు వార్నింగ్ ఇచ్చారు' అని శ్యామ్‌వర్ రాయ్ కోర్టుకు వివరించాడు.