
మానవ జాతి అంతరించిందన్న జకీర్ నాయక్
న్యూఢిల్లీ: కొందరు సినిమాలు చూసి, మరికొందరు పుస్తకాలు చదివి దోపిడీలు చేసిన వారు ఉన్నారు. హత్యలు చేసిన వారున్నారు. అందుకు వారిని శిక్షిస్తున్నాం తప్ప, వారికి స్ఫూర్తినిచ్చిన సినిమాలనుగానీ, పుస్తకాలనుగానీ శిక్షించడం లేదు. వాటిని నిషేధించడం లేదు. ఢాకా పేలుళ్లకు స్ఫూర్తినిచ్చాడని భావిస్తున్న ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఢాకా పేలుళ్లకు పరోక్షంగా కారణమైన నాయక్‌ను శిక్షించాలని, ఆయన్ని, ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను నిషేధించాలని ఆరెస్సెస్ డిమాండ్ చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తోంది.
దీనికి స్పందించిన భారత కేంద్ర హోం శాఖ జకీర్ నాయక్ ప్రవచనాలపై, ఆయన నడుపుతున్న సంస్థకు వస్తున్న ఆర్థిక సహాయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం వారినే శిక్షించాలి తప్ప అందుకు స్ఫూర్తినిచ్చారంటూ ఎవరినో శిక్షించడం తప్పవుతుంది. దొంగతనాలు, హత్యలకు స్ఫూర్తినిచ్చాయని సినిమాలను, పుస్తకాలను నిషేధించలేం గదా! సమాజంలో నేరం చేసిన వారికి సరైన నడవడి నేర్పలేదన్న కారణంగా వారి తల్లిదండ్రులనో, ఉపాధ్యాయులనో శిక్షించలేముగదా!
అచ్చంగా జకీర్ నాయక్ అంశానికి కూడా అదే వర్తిస్తుంది. జకీర్ నాయక్ నిజంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనుకుంటే చట్టాల ప్రకారమే ఆయన్ని విచారించి చర్య తీసుకోవాలి. ఢాకా పేలుళ్లకు తమకూ జకీర్ హుస్సేన్ ప్రవచనాలు స్ఫూర్తినిచ్చాయంటూ అక్కడ పేలుళ్లకు బాధ్యులు చెప్పారంటూ ఇక్కడ భారత్‌లో ఆయనపై చర్య తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా బంగ్లాదేశ్, కొంతభాగం కాశ్మీర్‌కు పరిమితమైన ఆయన అభిమానులు రేపు భారత్ అంతా విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు అనవసరమైన ప్రచారాన్ని కల్పించాయి.
నిషేధం లాంటి చర్యలను ఆశ్రయించడం కన్నా జకీర్ నాయక్‌తో సైద్ధాంతికంగా పోరాడి ప్రజల్లో ఆయన ఆనవాళ్లను తుడిచేయడమే ఉత్తమమైన మార్గం. జకీర్ నాయక్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కోవడం చాలా సులభం కూడా. ఆయన స్కాలర్‌నని చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన మెడిసిన్ చదివినప్పటికీ ఆయనకు ఏ సబ్జెక్టుపైనా పెద్దగా పట్టు, అంతగా అవగాహనా లేదని చెప్పవచ్చు. ఆయన ఉపన్యాసాలను గమనిస్తేనే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. డార్విన్ థియరీ గురించి ఆయన చెప్పిన మాటల్లో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి.
‘హోమో సెపియన్స్’ ఐదు లక్షల ఏళ్ల క్రితమే భూమిపైనా అంతరించి పోయాయని ఆయన ఓ టెలివిజన్ ఉపన్యాసంలో చెప్పారు. ఆయనతో సహా మానవ జాతి ఇప్పటికీ బతికే ఉంది. హోమో సాపియన్స్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హోమో అంటే మనిషి అని అర్థం. సోపియన్స్ అంటే జాతి లేదా ఉపజాతి. మొత్తం పదానికి మానవ జాతి అని అర్థం. స్వీడన్‌కు చెందిన ప్రముఖ వృక్ష, జంతు, భౌతిక శాస్త్రవేత్త కార్ల్ లిన్నాయిస్ 1758లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఈ విషయం స్కాలరైన జకీర్ నాయక్‌కు తెలియక పోవడం దారుణం. ఆయన ఉపయోగించే పదాల్లో ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. గాలపాగోస్ దీవులను కెలోట్రపస్ దీవులని చెబుతారు. ఇలా ఎన్నో....