
జకీర్ నాయక్ పై చర్యలు ఉంటాయ్: వెంకయ్య
రెచ్చగొట్టేలా మాట్లాడిన జకీర్ నాయక్ పై తన వైపు నుంచి ఉన్న అధికారాల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా మాట్లాడిన జకీర్ నాయక్ పై తన వైపు నుంచి ఉన్న అధికారాల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.
టెలివిజన్ నియమనిబంధనలు ఉల్లంఘించి మరి కొంతమంది సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారని, దిగుమతి చేసుకుంటున్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, చట్ట ప్రకారం వారిపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2008లో ఓ టీవీ చానెల్ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అది 2009లో తిరస్కరణకు గురైందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రసారశాఖ బాధ్యతలు కొత్తగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతికి వచ్చిన విషయం తెలిసిందే.
కశ్మీర్ అల్లర్లపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పొరుగుదేశం నుంచి స్పూర్తి పొందిన కొంతమంది దేశంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే పాకిస్తాన్ ఎత్తుగడలు ఎట్టిపరిస్థితుల్లోనూ పారవని ఆయన స్పష్టం చేశారు.