
పోలీసులు నజర్ పెట్టడంతో వెనక్కి తగ్గాడా?
ముంబై రాకను క్యాన్సిల్ చేసుకున్న జకీర్
ముంబై: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ సోమవారం సౌదీ అరేబియా నుంచి ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తన పర్యటన వాయిదాపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.
గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా నుంచి ముంబయికి తిరిగి రాగానే ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణను తప్పించుకొనేందుకు జకీర్ తన ముంబై పర్యటనను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
జకీర్ విద్వేష పూరిత మతప్రసంగాల కారణంగానే ఢాకాలో ఉగ్రదాడులు జరిగినట్టు వార్తలు వచ్చిన క్రమంలో ఆయన నడిపిస్తున్న 'పీస్' చానెల్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.