ఐటీని ముంచిన వరదలు!
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో చెన్నై ఐటీ రంగానికి 60 మిలియన్ డాలర్ల (రూ. 400 కోట్ల) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్న ఐటీ కంపెనీలకు వాటిల్లిన నష్టం 10 మిలియన్ డాలర్ల వరకు ఉండగా, పెద్ద కంపెనీలు 50 మిలియన్ డాలర్ల వరకు నష్టపోయిన్నట్లు అంచనా వేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజంట్, ఇన్ఫోసిస్ లాంటి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను బెంగళూరుకు తరలించి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాయి.
ఐటీ రంగంతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమోబైల్ రంగానికి సుమారు 15,000 కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నట్లు అంచనావేస్తున్నారు. చిన్న, మధ్య తరహా, సాంకేతిక, టెక్స్టైల్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు అసోచామ్ వెల్లడించింది. వర్షాలతో మూతపడిన పలు కంపెనీలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఈ పరిస్థితి శనివారం వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.